రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాల ఘటన కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన కేసులో పోలీసుల కాల్పుల్లో గాయపడి, ఆ తర్వాత శస్త్రచికిత్స ద్వారా కాలు కోల్పోయిన నిందితుడు హేమంత్ ఉదంతంపై హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల ఎన్‌కౌంటర్ యత్నం, కాలు తొలగింపు వ్యవహారంలో ఒక పిటిషన్ విచారణకు రాగా, ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు కోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అనంతపురం ఆస్పత్రి యాజమాన్యానికి జారీ చేసిన నిబంధనలు ఏంటి..?
ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, నిందితుడు హేమంత్‌కు సర్జరీ చేసి తొలగించిన కాలును ఎట్టి పరిస్థితుల్లోనూ పారవేయకుండా అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించింది. ఈ మేరకు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఫోరెన్సిక్, వైద్య పరీక్షల కోసం తొలగించిన శరీర భాగాన్ని పదిలంగా ఉంచాలని కోర్టు తెలిపింది.
అసలు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం. నిందితుడు హేమంత్‌ను చంపేందుకే పోలీసులు ప్లాన్ ప్రకారం ఎన్‌కౌంటర్ పేరుతో కాల్పులు జరిపారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా పోలీసుల కాల్పుల తర్వాత అతడి కాలును అసలు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అంశాలపై పూర్తి పారదర్శకతతో కూడిన మెడికల్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నిందితుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండి చికిత్స పొందుతున్నాడని, తొలగించిన కాలుకు మెడికల్ ప్రొసీజర్ ప్రకారం అవసరమైన ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తారని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం, నిందితుడికి అందించిన అత్యవసర వైద్య చికిత్సకు సంబంధించిన కేస్ షీట్లు, మెడికల్ బులిటెన్లు, శస్త్రచికిత్స నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. అలాగే అధికారులకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇస్తూ తదుపరి విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.
మొత్తానికి రాప్తాడు ఘటన సమాజంలో ఒకవైపు తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలిస్తుండగానే, మరోవైపు ఈ కేసుకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, పోలీస్ కాల్పుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశించినట్లుగా మెడికల్ రిపోర్టులో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.
