అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్, ఆసుపత్రిలోని తన బెడ్ పైనుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. కిందపడిన హేమంత్‌ను వెంటనే పైకి లేపి బెడ్‌పై పడుకోబెట్టారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో హేమంత్‌కు బీపీ, పల్స్ రేటు గణనీయంగా పడిపోయాయి. తీవ్రమైన శ్వాస సమస్య కూడా తలెత్తడంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నిందితుడికి వైద్యులు వెంటనే ఆక్సిజన్ సపోర్ట్ అందించి అత్యవసర చికిత్సను ప్రారంభించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి స్పష్టం చేశారు. నలుగురు నిపుణులైన వైద్యుల బృందం నిరంతరం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆమె తెలిపారు.
అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే…అక్టోబర్ 31న రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్కూల్ క్లాస్‌రూమ్‌లోకి చొరబడిన 21 ఏళ్ల హేమంత్, పదో తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై ఎలక్ట్రిక్ చైన్ సాతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలించిన పోలీసులు.. నవంబర్ 1వ తేదీన ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు హేమంత్ ఏకంగా సీఐపైనే దాడికి దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో హేమంత్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం జీజీహెచ్‌కు తరలించారు.
కాల్పుల గాయాల కారణంగా హేమంత్ కుడి కాలుకు రక్తప్రసరణ నిలిచిపోయి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ప్రాణాపాయం తప్పించేందుకు వైద్యులు అతని కుడి కాలును మోకాలి పైవరకు తొలగించాల్సి వచ్చింది. అలాగే ఎడమ కాలుకు కూడా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. మరోవైపు, నిందితుడి కిరాతక దాడిలో తీవ్రంగా గాయపడి, తన కుడి చేయిని కోల్పోయిన బాధితురాలు గోపిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గోపిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై నుంచి తప్పించారని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది.
ఈ దారుణ ఘటనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. నిందితుడిపై జరిగిన పోలీసుల కాల్పులు, అతనికి అందుతున్న వైద్య సహాయం, అలాగే బాధితురాలికి కల్పిస్తున్న చికిత్స తదితర వివరాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఇప్పటికే హైకోర్టు పోలీసు విభాగాన్ని ఆదేశించింది.ఈ కేసును అటు పోలీస్ శాఖ, ఇటు న్యాయస్థానం అత్యంత సీరియస్‌గా తీసుకున్నాయి. నిందితుడి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.
