“శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. కార్తీక మాసం ఉత్సవాలతో భక్తులతో కిక్కిరిసిపోతున్న శ్రీశైలం టోల్ గేట్ సమీపంలో ఒక భారీ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించింది. హఠాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడ వరుసగా ఆగి ఉన్న వాహనాలపైకి ఆ రాకాసి బస్సు దూసుకెళ్లింది. కళ్లముందే ఒకదానివెనుక ఒకటిగా 5 కార్లు, ఆటోలు నుజ్జునుజ్జయ్యాయి. శ్రీశైలం టోల్ గేట్ వద్ద క్షణాల వ్యవధిలోనే ఏం జరుగుతుందో తెలియక భక్తులు భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సు భక్తులను తీసుకుని శ్రీశైల క్షేత్రానికి చేరుకుంది. ఆదివారం రాత్రి శ్రీశైలం ప్రధాన టోల్ గేట్ వద్దకు బస్సు రాగానే, ఒక్కసారిగా బస్సు బ్రేకులు పనిచేయడం ఆగిపోయాయి. కొండ ప్రాంతం కావడంతో బ్రేక్ ఫెయిల్ అయిన బస్సు వేగాన్ని పైలట్ అదుపు చేయలేకపోయాడు. దీంతో ఆ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి రోడ్డుపై అతివేగంగా దూసుకెళ్తూ, టోల్ గేట్ వద్ద నిలిచి ఉన్న ముందు వాహనాన్ని చాలా బలంగా ఢీకొట్టింది.”
“టోల్ గేట్ వద్ద బస్సు ముందరి కారును ఢీకొట్టిన తీవ్రతకు.. ఆ కారు వెనక ఉన్న మరో నాలుగు కార్లు, ఒక ఆటో ఒకదానికొకటి చాలా వేగంగా ఢీకొన్నాయి. సెకన్ల వ్యవధిలో 5 కార్లతో పాటు ఆటో ఘోరంగా ధ్వంసమయ్యాయి. బస్సు వేగానికి వాహనాలు నుజ్జునుజ్జవ్వడం, పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో టోల్ గేట్ పరిసర ప్రాంతం అంతా తీవ్ర భయాందోళనకు గురైంది. వాహనాల్లో ఉన్న భక్తులు, ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. రద్దీగా ఉండే టోల్ గేట్ వద్ద ఈ యాక్సిడెంట్ జరగడం తీవ్ర కలకలం రేపింది.”
“ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి వాహనాల్లో ఉన్నవారిని బయటకు తీశారు. ఈ దారుణ ఘటనలో అదృష్టవశాత్తూ ఒక చిన్నారి మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడింది. ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని, కానీ దేవుడి దయ వల్ల అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన చిన్నారికి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అందించారు.”
“ఈ ఘోర ప్రమాదం కారణంగా శ్రీశైలం టోల్ గేట్ వద్ద చాలా సమయం పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే క్రేన్లను రప్పించి ధ్వంసమైన కార్లు, ఆటోను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ప్రయాణించే టూరిస్ట్ బస్సులు తమ వాహనాల కండిషన్, బ్రేకింగ్ సిస్టమ్‌ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
