పండుగ పూట వెలుగులు నిండాల్సిన ఒక ఇంట్లో ఊహించని అగ్నిప్రమాదం తీవ్ర గుండెకోతను మిగుల్చింది. మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఒక ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. బాణసంచా దుకాణంలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనాన్ని చుట్టేసి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మృతుల్లో కేవలం రెండు నెలల పసికందు కూడా ఉండటంతో స్థానికులు ఉండడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరయ్యారు. అసలు ఆ బాణసంచా షాప్లో మంటలు ఎలా అంటుకున్నాయి? ఈ ప్రమాదంలో అసలేం జరిగింది..?
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా బర్హీ ప్రాంతంలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బర్హీలోని ఒక ప్రధాన ప్రాంతంలో ఉన్న బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు పడి భారీగా మంటలు చెలరేగాయి. షాప్లో పెద్ద ఎత్తున క్రాకర్స్, బాంబులు ఉండటంతో క్షణాల వ్యవధిలోనే పేలుళ్లు సంభవించి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ దట్టమైన పొగ, రాకాసి మంటలు ఆనుకుని ఉన్న మూడంతస్తుల నివాస భవనానికి వేగంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ఇల్లంతా మంటలతో నిండిపోవడంతో లోపల ఉన్న కుటుంబ సభ్యులు బయటకు రాలేక తీవ్ర భయాందోళనకు గురయ్యారు.”
“ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే బిల్డింగ్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పాటు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. దీంతో వేరే దారి లేక అధికారులు జేసీబీ యంత్రాలను రప్పించి భవనం వెనుక వైపు ఉన్న గోడలను కూల్చివేశారు. అలా గోడలు బద్దలు కొట్టి రెస్క్యూ టీమ్స్ లోపలికి ప్రవేశించి తీవ్ర అగ్నికీలల మధ్య చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు శ్రమించారు.”
“కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. భవనం లోపల చిక్కుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు మంటల దాడికి, దట్టమైన పొగకు ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల దేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమవ్వడం అక్కడ ఉన్న అందరినీ కంటతడి పెట్టించింది. ఈ దుర్ఘటనలో రెండు నెలల పసికందు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. పండుగ సరదా కోసం తెచ్చిన బాణసంచానే ఇలా ఒకే కుటుంబంలోని ఆరుగురిని పొట్టనబెట్టుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.”
“రెస్క్యూ టీమ్స్ మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? బాణసంచా దుకాణానికి తగిన ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు ఉన్నాయా లేదా? క్రాకర్స్ నిల్వ ఉంచే విషయంలో ఏమైనా నిర్లక్ష్యం వహించారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. రద్దీ ప్రాంతాల్లో బాణసంచా నిల్వల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
