హైదరాబాద్ లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు నిరసన కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా నిర్వహిస్తున్న బోరుబావులపై HYDRAA అధికారులు చేపడుతున్న వరుస కఠిన చర్యలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యజమానులు, ఆపరేటర్లు ఏకమై రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే ఈ నిరసనలో భాగంగా ఆపరేటర్లు ఇతర ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా, ట్యాంకర్లలో ఉన్న వేలాది లీటర్ల మంచినీటిని నడిరోడ్డుపై పారబోసి తమ నిరసన తెలపడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అసలు హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి? ట్యాంకర్ యజమానులు ఎందుకు రోడ్డెక్కారు?
ఈ వివాదం యొక్క పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తూ, వాణిజ్యపరంగా అధిక ధరలకు విక్రయిస్తున్న పలు అక్రమ బోరుబావులను గుర్తించిన హైడ్రా అధికారులు వారిపై కఠిన చర్యలు ప్రారంభించారు. సీజింగ్‌లు, కరెంట్ కనెక్షన్ల తొలగింపు వంటి చర్యలు చేపట్టారు. అయితే, అధికారుల ఈ ఆకస్మిక చర్యల వల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటోందని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఐటీ కారిడార్లతో పాటు నగరంలోని బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు నీటిని సరఫరా చేసే తమను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అడ్డుకుంటే వేలాది కుటుంబాలు వీధిన పడతాయని వారు వాపోతున్నారు.
ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చిన క్రమంలో నిరసనకారులు ఇతర ట్యాంకర్లను అడ్డుకోవడమే కాకుండా, ట్యాంకర్ల వాల్వ్‌లు తెరిచి వేలాది లీటర్ల నీటిని రోడ్లపైకి వదిలేశారు. దీంతో కిలోమీటర్ల మేర రోడ్లు జలమయమయ్యాయి. ఒకవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత వేధిస్తున్న సమయంలో, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్న తరుణంలో.. ఇలా తాగే నీటిని నడిరోడ్డుపై పారబోసి వృథా చేయడం పట్ల నగర ప్రజలు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలపడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, నిత్యం అవసరమయ్యే మంచినీటిని ఇలా బాధ్యతారాహిత్యంగా వృథా చేయడం ఏమాత్రం తగదని స్థానికులు మండిపడుతున్నారు.
బోరుబావుల విచ్చలవిడి నిర్వహణ, భూగర్భ జలాలు క్షీణించడంపై అధికారులకు ఉన్న ఆందోళనలను తాము అర్థం చేసుకుంటామని, అయితే తాము కూడా సంవత్సరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని ట్యాంకర్ యజమానులు స్పష్టం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టకుండా ప్రభుత్వమే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్దిష్టమైన నిబంధనలతో ప్రైవేట్ ట్యాంకర్లకు వాటర్ ఫిల్లింగ్ పాయింట్లు కేటాయించాలని, లేదా నిబంధనల ప్రకారం పర్మిషన్లు జారీ చేసి తమ జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించకపోతే నగరవ్యాప్తంగా నీటి సరఫరాను పూర్తిగా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
నగరంలో ఒకవైపు అక్రమ బోరుబావుల నియంత్రణకు అధికారుల కఠిన నిబంధనలు, మరొకవైపు ప్రైవేట్ ట్యాంకర్ల సమ్మె హెచ్చరికలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ట్యాంకర్ యజమానుల సంఘాల మధ్య తక్షణమే చర్చలు జరిగి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నీటి వృథా కాకుండా సరైన పరిష్కారం లభించాలని అందరూ కోరుకుంటున్నారు.
