తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రాప్తాడు జెడ్పీ స్కూల్ రంపం దాడి కేసులో ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి గదిలోకి చొరబడి ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై రక్తపాతానికి పాల్పడిన ఉన్మాది హేమంత్.. బయటి వ్యక్తేమీ కాదు, ఆ చిన్నారికి అత్యంత దగ్గరి బంధువు అని తేలింది. తల్లీతండ్రీ లేరని ఆశ్రయం ఇచ్చిన సొంత అక్క కుటుంబానికే హేమంత్ కొరకరాని కొయ్యగా మారాడు. అసలు ఆ కుటుంబ బంధం ఏమిటి? హేమంత్ చేసిన దారుణం వల్ల అతడి సొంత అక్క కాపురం ఎలా ప్రమాదంలో పడింది?
“పోలీసుల లోతైన దర్యాప్తులో నిందితుడు హేమంత్ నేపథ్యానికి సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. హేమంత్ పెద్ద అక్క పేరు భవిత, ఆమె భర్త విజయ్ కుమార్. ఇక దాడికి గురైన బాలిక.. ఇదే విజయ్ కుమార్ తోడబుట్టిన సోదరి పార్వతి కుమార్తె. అంటే, హేమంత్ తన సొంత అక్క భవిత అత్తగారింటికి చెందిన ఆడబిడ్డ కూతురిపైనే ఈ భయానక రంపంతో దాడికి ఒడిగట్టాడు. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసికందుపై ఎలక్ట్రిక్ రంపంతో పడగవిప్పడం స్థానికులను తీవ్ర షాక్కు గురిచేసింది.”
హేమంత్ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో దిక్కులేని అతనికి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నది అతని సొంత అక్క భవిత, బావ విజయ్ కుమార్లే. అయితే తాము ఉంటున్న అక్క అత్తగారింటి కుటుంబానికి చెందిన ఒక చిన్న ఆడపిల్లపైనే హేమంత్ ప్రేమ పేరుతో వేధించినట్లుగా తెలుస్తోంది. ఇంతటితో సరిపెట్టకుండా పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఆ బాలిక ఒప్పుకోకపోవడంతోనే అతడు ఇంత కిరాతకంగా ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేయడాన్ని అతని అక్క, బావ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. హేమంత్ చేసిన ఈ సైకో ప్రవర్తన వల్ల అతని అక్క కాపురం, వారి కుటుంబ బంధాలు పూర్తిగా దెబ్బతిని ప్రమాదంలో పడ్డాయి. ఉన్మాది చర్యల వల్ల ఆ అక్క కుటుంబం తీవ్ర అసహ్యానికి, సమాజంలో అవమానానికి గురికావాల్సి వచ్చింది.”
“పాఠశాల గదిలోకి దూరి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న బాలికను రంపంతో చంపాలని చూసిన ఇలాంటి క్రూరుడికి మద్దతుగా నిలిస్తే సమాజం, బంధువులు తమను కూడా తప్పుబడతారని హేమంత్ అక్క, బావ భావించారు. అందుకే ఈ కేసు విషయంలోనూ, హేమంత్ విషయంలోనూ వారు పూర్తిగా దూరంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమకు ఆశ్రయం ఇచ్చిన ఇంటికి, తమ అత్తగారి బంధువులకే ద్రోహం చేసిన హేమంత్ ఉన్మాదాన్ని వారు తీవ్రంగా ఖండిస్తూ అతడికి పూర్తిగా దూరమయ్యారు.”
ఇక అటవీ ప్రాంతంలో పోలీసులపై దాడికి యత్నించిన సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్.. ప్రస్తుతం అనంతపురం GGH పోలీస్ కస్టడీలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కాల్పుల్లో అతడి కాళ్లకు బుల్లెట్లు దిగడంతో పరిస్థితి శస్త్ర చికిత్స చేసి మొత్తానికి మొత్తానికి కాలులో ఉన్న బులెట్లను తొలగించారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం ఏఎంసీ వార్డుకు తరలించి ప్రత్యేక భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారు. అతడు చేసిన ఘోరమైన తప్పు కారణంగా, అటు బాధితురాలి తరపు బంధువులతో పాటు, ఇటు ఆశ్రయమిచ్చిన సొంత అక్క కుటుంబ సభ్యులు కూడా హేమంత్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడకుండా ఆస్పత్రి వైపు రాకుండా వదిలేశారు. చట్టం అతడికి తగిన శిక్ష విధిస్తుందని సమాజం కోరుకుంటోంది.
