ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోమవారం రాత్రి ఒక ఉమ్మడి ప్రకటన ద్వారా అధికారికంగా వెల్లడించారు. గత కొంతకాలంగా వీరి వ్యక్తిగత జీవితంపై వస్తున్న పలు ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. తమ సంయుక్త ప్రకటనలో వారు హుందాగా స్పందిస్తూ, జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని కలిసి గడిపిన తర్వాత.. పరస్పర అవగాహన, గౌరవంతోనే ఈ విడిపోయే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వైవాహిక జీవితం ముగిసినప్పటికీ, తామిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని వివరించారు.
విడిపోతున్నప్పటికీ, పిల్లల పట్ల తమకున్న బాధ్యతలను విస్మరించబోమని ఈ జంట స్పష్టం చేసింది. తమ చక్కని పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని ఉమ్మడి ప్రకటనలో స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, వారి శ్రేయస్సు ఎల్లప్పుడూ ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యతలుగా ఉంటాయని లేఖలో తెలిపారు. జీవితంలో ఎంతో కీలకమైన ఈ దశలో మీడియా, అభిమానులు, ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకుని, సానుభూతితో వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. అలాగే, ఇప్పటివరకు తమ జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.రాజకీయంగా, సినీపరంగా అత్యంత ప్రజాదరణ ఉన్న పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్, అనా కొణిదెల ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న తరుణంలో.. ఈ వ్యక్తిగత నిర్ణయం బయటకు రావడం సంచలనంగా మారింది. ఇటు జనసేన శ్రేణులు, అటు పవర్‌స్టార్ అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా అభిమానులు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది ఆయన వ్యక్తిగత విషయమని, రాజకీయాలకు దీనికి సంబంధం లేదని తెలిపారు. ఈ సమయంలో ఆయన ప్రైవసీని కాపాడదాం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ జంట ఎంతో హుందాగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.
అసలు వీరి ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే.. సుదీర్ఘ కాలం పాటు వీరిద్దరూ ఎన్నో ఎత్తుపల్లాలను కలిసి ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో, 2024 ఎన్నికల విజయంలో అనా కొణిదెల పాత్ర కూడా ఉందనే చర్చ నడిచింది. అలాంటిది, ఇప్పుడు ఇరుపక్షాల అంగీకారంతో, స్నేహపూర్వక వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకోవడం వారి మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని చూపిస్తోంది. తాము విడిపోయినప్పటికీ ..మంచి స్నేహితులుగా ఉంటామని, పిల్లల శ్రేయస్సే తమ ప్రాధాన్యత అని ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.
సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు అంటే ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తుంటాం.. కానీ పవన్-అనా జంట మాత్రం ఎంతో మెచ్యూర్డ్‌గా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేశారనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి అమరావతి పొలిటికల్ సర్కిల్స్‌లోనూ, ఫిలిం నగర్ వర్గాల్లోనూ ఇదే హాట్ టాపిక్. ఈ నిర్ణయం తర్వాత పవన్ కల్యాణ్ తన అధికారిక కార్యక్రమాల్లో ఎప్పటిలాగే పాల్గొంటారా? లేదా కొద్దిరోజులు వ్యక్తిగత సమయం తీసుకుంటారా? అనేది చూడాలి.
