ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక విశ్లేషణ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలం మరింత పుంజుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇటు పట్టణాల్లోనూ, అటు పల్లెల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించిందని సీఎం వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. తాజాగా జరిగిన పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9 శాతం ఓట్లను సాధించిందని సీఎం వెల్లడించారు.
2024 ఎన్నికల్లో ఇది 55.3 శాతంగా ఉండగా, ఇప్పుడు ఏకంగా 3.6 శాతం ఓట్లు పెరిగాయని ఆయన వివరించారు.
మరోవైపు వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుకు భారీ గండి పడిందని చంద్రబాబు తెలిపారు. 2024 ఎన్నికల్లో 39.81 శాతం ఓట్లు సాధించిన వైసీపీ, ఈ స్థానిక ఎన్నికల్లో కేవలం 33.56 శాతానికే పరిమితమైందన్నారు. అంటే 2024తో పోలిస్తే వైసీపీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని సీఎం వివరించారు. మొత్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి, వైసీపీకి మధ్య 25.34 శాతం మేర భారీ వ్యత్యాసం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల సరళిని కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విశ్లేషించారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్డీఏకు 59.9 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 34.3 శాతం ఓట్లు మాత్రమే దక్కాయని తెలిపారు. పట్టణాల్లో కూటమి స్ట్రైక్ రేట్ ఏకంగా 94 శాతంగా నమోదైందని సీఎం చెప్పారు. ఇక పల్లెల్లో, అంటే జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏకు 57.6 శాతం ఓట్లు రాగా, వైసీపీ 39.7 శాతం ఓట్లు సాధించింది. ఇక్కడ కూటమి స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా ఉంది. ఓట్ల శాతంలో వ్యత్యాసాన్ని పరిశీలిస్తే, పట్టణాల్లో 25.60 శాతం, పల్లెల్లో 17.9 శాతం మేర కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిందని చంద్రబాబు తెలిపారు.
ఉద్యోగుల నాడిని తెలిపే పోస్టల్ బ్యాలెట్లలోనూ ఎన్డీఏ కూటమి ఏకపక్ష విజయం సాధించిందని సీఎం వెల్లడించారు. పట్టణ ఎన్నికల్లో ఎన్డీఏకు 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్లు పడితే, వైసీపీకి 27.42 శాతం మాత్రమే వచ్చాయన్నారు. అలాగే పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏకు 62.83 శాతం, వైసీపీకి 31.46 శాతం పోస్టల్ బ్యాలెట్లు దక్కాయని తెలిపారు.
ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే, రాష్ట్రవ్యాప్తంగా 9,818 స్థానాలకు గానూ కూటమి 7,803 స్థానాలను కైవసం చేసుకుందని చంద్రబాబు చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలోని 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు గానూ కూటమి ఏకంగా 575 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించగా, కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ కూటమి కంటే ఎక్కువ సీట్లు సాధించిందని తెలిపారు.
అంతేకాకుండా, రాష్ట్రంలోని 7 జిల్లాల్లో వైసీపీకి కనీసం ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయిందని చంద్రబాబు స్పష్టం చేశారు.
