TDP వ్యవస్థాపక కాలం నుంచే.. బీసీ వర్గాలు తమకు ప్రధాన బలగంగా నిలిచాయన్నారు సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపల్లె వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై… తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీసీలకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి వెనకడుగు వేయబోదని, దీనిపై సుప్రీంలో కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రిజర్వేషన్ల తగ్గింపునకు బీసీ నేతల పదవుల నష్టానికి YCP తీరే కారణమని చంద్రబాబు ఆరోపించారు.హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తాము తక్షణమే స్పందిస్తున్నామని, బీసీల రాజకీయ హక్కులను కాపాడేందుకు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతాన్ని చంద్రబాబు నాయుడు గత చరిత్రతో పోల్చుతూ వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 1995లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి రాజకీయ ఎదుగుదలకు బాటలు వేశామని గుర్తుచేశారు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఈ రిజర్వేషన్ల శాతాన్ని 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16,800 మంది బీసీ నేతలు తమ స్థానిక సంస్థల పదవులను, రాజకీయ అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని గణాంకాలతో సహా విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు ప్రయత్నించగా, వైసీపీ నాయకులు దాన్ని అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయించారని చంద్రబాబు మండిపడ్డారు. గత 45 ఏళ్లుగా బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచాయని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ వర్గాలే అండగా నిలబడ్డాయని చంద్రబాబు గుర్తు చేశారు
