ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షించే థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ దీవిలో ఒక పెను విషాదం చోటుచేసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న తెల్లవారుజాము సమయంలో, ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
థాయ్‌లాండ్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్‌లోని పటాంగ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాలకు ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పటాంగ్‌లోని ఒక కమర్షియల్ బిల్డింగ్‌లో మొదటగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము సమయం కావడంతో అక్కడున్న వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. చూస్తుండగానే ఆ అగ్నికీలలు ఉగ్రరూపం దాల్చి, పక్కనే ఉన్న ఇతర భవనాలకు కూడా వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో పాటు మంటలు ఎగసిపడటంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
ఈ ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం భారీగానే సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడం, పొగ ఊపిరాడకుండా చేయడంతో ఈ దుర్ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి, గాయపడిన 16 మందిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, క్షతగాత్రులలో 15 మంది థాయ్ పౌరులు కాగా, ఒకరు మయన్మార్ జాతీయుడిగా గుర్తించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అగ్నిమాపక సిబ్బంది దాదాపు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాలిపోయిన భవనాల శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఈ భారీ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటనే దానిపై థాయ్‌లాండ్ అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? లేక వాణిజ్య భవనంలో అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇంత పెద్ద నష్టం జరిగిందా? అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.
నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఫుకెట్‌లోని పటాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ విషాదం అందరినీ కలచివేస్తోంది. కమర్షియల్ బిల్డింగ్స్, హోటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా లేకపోతే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని థాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
