రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తక్కుగూడ పరిధిలోని హర్షగూడకు చెందిన బెటాలియన్ కానిస్టేబుల్ శ్రీను ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ వేధింపులు భరించలేక అతడు బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీను మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పహాడిషరీఫ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న తుక్కుగూడ పరిధిలోని హర్షగూడలో నివాసముంటున్న 31 సంవత్సరాల ముడావత్ శ్రీను సోమవారం ఉదయం నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2024 బ్యాచ్ కు చెందిన శ్రీను కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం కొన్ని అత్యవసర అవసరాల నిమిత్తం ఆయన ఒక ఆన్‌లైన్ మొబైల్ లోన్ యాప్ ద్వారా రూ. 40 వేల అప్పుగా తీసుకున్నారు. అయితే, నిర్దేశిత సమయంలో ఆ మొత్తం చెల్లించడంలో కొంత ఆలస్యం కావడంతో, లోన్ యాప్ ఏజెంట్ల నుంచి రికవరీ పేరిట తీవ్రమైన ఒత్తిడి మొదలైంది.
ముఖ్యంగా పండుగ సెలవుల సమయంలో ఈ సైబర్ రికవరీ ముఠాల అగడాలు శృతిమించాయి. దీపావళి సెలవుల్లో ఉన్న శ్రీనుకు ప్రతి గంటకూ ఫోన్లు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం బూతులు, తిట్లతో సరిపెట్టకుండా, శ్రీనుతో పాటు ఆయన భార్యకు సంబంధించిన ఫోటోలను అసభ్యకరంగా, నగ్నంగా మార్ఫింగ్ చేస్తామని భయపెట్టారు. ఆ మార్ఫింగ్ ఫోటోలను కుటుంబ సభ్యులకు, బంధువులతో పాటు గ్రామంలోని వారందరికీ వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తామని బెదిరించడమే కాకుండా, శ్రీనును హతమారుస్తామంటూ ప్రాణహాని హెచ్చరికలు కూడా చేశారు.
శ్రీనుకు వివాహమై సరిగ్గా ఏడాది కాలం మాత్రమే పూర్తయింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ యువకుడు, ఈ రకం సైబర్ బ్లాక్‌మెయిలింగ్, సొసైటీలో పరువు పోతుందనే తీవ్రమైన మానసిక వేదనకు లోనయ్యారు. నిరంతరం వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ వల్ల విపరీతమైన ఒత్తిడికి గురైన శ్రీను, ఈ అవమానాన్ని తట్టుకోలేక చివరకు ఇంట్లోనే బలవన్మరణానికి ఒడిగట్టారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆయన భార్య, కుటుంబ సభ్యులు గుండెకోతకు గురయ్యారు. మరో విషయం ఏంటంటే.. అతడు చనిపోయాక కూడా లోన్ యాప్ నిర్వాహకులు నుంచి కాల్స్ వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఎస్సై వినోద్ నేతృత్వంలో లోన్ యాప్ నిర్వాహకుల కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటువంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు లేని అక్రమ లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా వేధింపులు ఎదురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు గానీ, సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
