అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా.. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులందరూ హాజరైన ఈ సమావేశంలో.. పలు ముఖ్యాంశాలు చర్చించారు.
ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి రాబోతున్న భారీ పెట్టుబడులపైనే ఫోకస్ పెట్టారు. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించిన పలు మెగా ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అత్యంత కీలకమైనది… సుమారు 31 వేల 387 కోట్ల రూపాయల విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో వేలాది మంది యువతకు అత్యాధునిక సాంకేతిక రంగంలో ఉపాధి లభించనుంది. దీనితో పాటు సోలార్ విద్యుత్ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలపై కేబినెట్ ముద్ర వేసింది.
భవిష్యత్ తరాల సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన నూతన పాలసీల ముసాయిదాలకు ఆమోదం తెలిపింది. ఏపీ యానిమేషన్ & వీఎఫ్ఎక్స్ పాలసీతో పాటు, దేశంలోనే ప్రత్యేకంగా రోబోటిక్స్ & ఫిజికల్ ఏఐ విధానం, అలాగే సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీలను ఈ భేటీలో ఖరారు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ సరికొత్త విధానాలను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లపై కేబినెట్ విస్తృతంగా సమీక్షించింది. ప్రపంచ నలుమూలల నుంచి రాబోతున్న పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, పెట్టుబడిదారులకు ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను చాటిచెప్పేలా చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం, సేవల నిర్వహణలో కొన్ని కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సాంప్రదాయకంగా వస్తున్న గొల్ల సన్నిధి పోస్టు పునరుద్ధరణతో పాటు, ఆలయ సేవల నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో పాటు, ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కూడా మంత్రివర్గంలో అంతర్గత చర్చ జరిగింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల సరళి మరియు భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు సమీక్షించారు.మొత్తంగా చూస్తే ఇవాళ్టి ఏపీ కేబినెట్ భేటీ కేవలం పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా, ఎన్నికల ఫలితాలపై కూడా హర్షం వ్యక్తం చేశారు.
