అసోం రాజధాని గువాహటిలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలుడు తన కన్నతల్లిపై కత్తితో దాడి చేశాడు. పలుమార్లు దాడి చేయడంతో ఆ మహిళ రక్తపు మడుగులో కుప్పకూలింది. ఇక అనంతరం భయపడిపోయిన ఆ బాలుడు తన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో… నా తల్లిని కత్తితో దాడి చేశానని.. వెంటనే ఆమెను కాపాడాలంటూ కోరాడు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన నగర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
గువాహటిలోని బామునిమైదామ్ ప్రాంతంలో చంద్రాణి అనే మహిళ నివాసముంటోంది. ఆమె కుమారుడు స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇకపోతే.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో, ఊహించని విధంగా ఆ బాలుడు తన కన్నతల్లిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఆ తల్లి మెడపై తీవ్రమైన గాయాలవ్వడంతో రక్తపు మడుగులో కుప్పకూలి పడిపోయింది.
తల్లిపై దాడి చేసిన తర్వాత ఆ బాలుడు ఆందోళనతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన పాఠశాల వాట్సాప్ గ్రూప్‌లో ఒక మెసేజ్ చేశాడు. తాను తన తల్లిపై దాడి చేశానని, తన ఇంటి అడ్రస్ గుర్తించి, తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లిని వెంటనే కాపాడాలని ఆ గ్రూప్‌లో మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ పంపిన కొద్దిసేపటికే, అతడు సమీపంలోని ఓ బిల్డింగ్ టెర్రస్ మీదకు ఎక్కి, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన ఆ షాకింగ్ మెసేజ్‌తో పాటు, బిల్డింగ్ పైనుంచి బాలుడు దూకిన సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కిందపడి ప్రాణాలు కోల్పోయిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, బాలుడి ఇంటికి చేరుకున్న పోలీసులు మెడపై తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న తల్లిని గుర్తించి, తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఇంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఎందుకు లోనయ్యాడు, ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా, లేక మొబైల్ గేమ్స్ లేదా ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి మొబైల్ ఫోన్ డేటాను, స్కూల్ వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక కుటుంబాన్ని కోలుకోలేని విషాదంలో ముంచేయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
