రాప్తాడు నిందితుడు హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు అతన్ని అనంతపురం నుంచి కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 13 రోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం వచ్చింది. అంటే ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే ఒక తీవ్రమైన, ప్రాణాపాయ పరిస్థితి సమస్య తలెత్తింది. దీంతో రెండు రోజులుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం అనంతపురం నుంచి కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి హెల్త్ కండీషన్ విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాప్తాడు హైస్కూల్ ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్‌కు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురం నుంచి అత్యవసరంగా కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే డాక్టర్ పల్లవి అతడికి ప్రాథమికంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో వైద్యులు హేమంత్‌కు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేశారు. జీజీహెచ్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ వెంకట గణేష్ గుండె సంబంధిత సమస్యలపై కీలక పరీక్షలు నిర్వహించారు. హేమంత్ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఉందని, దీనివల్ల అతడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని డాక్టర్ వెంకట గణేష్ తెలిపారు. గడ్డకట్టిన రక్తాన్ని సకాలంలో తొలగించకపోతే అది మెదడు, గుండె లేదా ఊపిరితిత్తులకు చేరి ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కార్డియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ పర్యవేక్షణలో హేమంత్‌కు చికిత్స కొనసాగుతోంది. కార్డియాలజీ ఐసీయూలో ఉంచి, ఒక ప్రత్యేక వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది.
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై హేమంత్ రంపం మిషన్‌తో దాడి చేశాడు. నేరుగా స్కూల్లోకి వెళ్లిన నిందితుడు.. తరగతి గదిలోనే పిల్లలందరితో పాటు టీచర్ చూస్తుండగానే ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డాడు.ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అటాక్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న హేమంత్‌ను పట్టుకునేందుకు వెళ్లగా నిందితుడు పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపగా నిందితుడి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌కు వైద్యులు ఆపరేషన్ చేశారు. అతని కాళ్లకు శస్త్ర చికిత్స చేసి బుల్లెట్లు తొలగించారు.
బుల్లెట్ గాయాలకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత, కదలికలు లేకపోవడం వల్లే అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టి పల్మనరీ ఎంబాలిజం సమస్య తలెత్తిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. నిందితుడి పరిస్థితి నిలకడగా లేకపోవడంతో కర్నూలు ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు, ఈ దారుణ ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. నిందితుడు హేమంత్ నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు ఎలక్ట్రిక్ రంపం మిషన్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, ఈ దాడి వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. నిందితుడు కోలుకున్న వెంటనే అతడిని కస్టడీలోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.ఇటు బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినికి ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఉన్నతాధికారులు ఇప్పటికే భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు, పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఘటనతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.
