వరుసగా రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన గాయం ఇంకా మానకముందే.. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో భారీ ముప్పు పొంచి ఉంది. అవును, సముద్రంలో మొదలైన వాతావరణ మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను, ముఖ్యంగా తీర ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. ఒకవేళ ఇది తుపానుగా మారితే దానికి ‘అక్వాన్’ అనే పేరు కూడా సిద్ధంగా ఉంది. ఇంతకీ ఈ కొత్త అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏపీ, తమిళనాడు తీరాల వైపు దూసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది వేగంగా బలపడి రేపటికి తీవ్ర అల్పపీడనంగా మారి, నవంబర్ 15 నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ వాయుగుండం ఆ తర్వాత ఏ దిశగా పయనిస్తుంది, మరింత తీవ్రమై తుపానుగా మారుతుందా లేదా అనే అంశాలపై ఐఎండీ నిశితంగా పరిశీలిస్తూ త్వరలోనే పూర్తి స్పష్టత ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే, ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలపై ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ నిపుణులు కీలక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం సముద్ర, వాతావరణ పరిస్థితులు ఈ వ్యవస్థకు చాలా అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ఇది మరింత బలపడి తుపానుగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇది తుపానుగా మారితే దీనికి ఇరాన్ సూచించిన ‘అక్వాన్’ అనే పేరు పెట్టనున్నారు. వెదర్ మోడల్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల దిశగా కదిలే సూచనలు ఉన్నప్పటికీ.. సముద్రంలో ఉండగానే దిశ మార్చుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఐఎండీ తీరం దాటే విషయంపై అధికారిక ప్రకటన చేయనందున వీటిని ప్రాథమిక అంచనాలుగానే చూడాలి.
ఈ అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, రాయలసీమలో నవంబర్ 14వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో 16-17 తేదీల్లోనూ వర్షసూచన ఉంది. కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనుండగా, అండమాన్ నికోబార్ దీవుల్లో నవంబర్ 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు హిమాలయ ప్రాంతాల్లోనూ వాతావరణం వేగంగా మారిపోతోంది. కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం వల్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మంచు, వర్షం కురిసే ఛాన్స్ ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురవనుండగా, పశ్చిమ, మధ్య భారతదేశంలో పొడి వాతావరణం ఉండనుంది. నవంబర్ రెండో వారం నడుస్తున్నా ఉత్తరాదిలో ఇంకా చలి పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ ‘అక్వాన్’ ముప్పుపై ఏపీ, తమిళనాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
