నవంబర్ నెలలో చలి తీవ్రత పెరుగుతుందనుకుంటున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు భారత వాతావరణ శాఖ ఒక కీలక అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో మొదలైన ఒక వాతావరణ కదలిక.. రాబోయే 48 గంటల్లో బలమైన వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది? దీని గమనం ఎటువైపు ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్‌లోని ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది..
అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సాధారణ స్థాయిలో కాకుండా, వాతావరణంలోని మధ్య ట్రోపో ఆవరణ స్థాయి వరకూ విస్తరించి ఉండటం గమనార్హం. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
ఇక ఈ అల్పపీడనం అక్కడితో ఆగకుండా రాబోయే రోజుల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ ఏర్పడే ఈ అల్పపీడనం, రేపటి నాటికి ‘స్పష్టమైన అల్పపీడనం’గా మారనుంది. ఆ తర్వాత కూడా దీని తీవ్రత పెరుగుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి అదే ప్రాంతంలో ‘వాయుగుండం’గా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం, ఇది వాయవ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఈశాన్య గాలులు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం రాయలసీమ ప్రాంతాల్లోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ వాయుగుండం కదలికలను వాతావరణ శాఖ నిరంతరం ట్రాక్ చేస్తోంది. 15వ తేదీన వాయుగుండంగా మారిన తర్వాత, ఇది ఏ తీరం వైపు వెళ్తుందనే దానిపై మరింత స్పష్టత రానుంది. అయితే, వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కోస్తాంధ్ర. రాయలసీమ రైతులు తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని… మత్స్యకారులు వేటకు వెళ్లకూదని సూచించింది.
