పంజాబ్ రాష్ట్రంలో ఒక భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. అమృత్సర్ నుండి న్యూ జల్పైగురి వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన నాలుగు బోగీలు పూర్తిగా మంటల్లో తగలబడ్డాయి. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలో ఉన్న సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ వద్ద ఈ భీకర ప్రమాదం చోటుచేసుకుంది. 12508 నంబర్ గల కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు గమ వెళ్తుండగా, ఒక్కసారిగా బోగీల నుండి దట్టమైన పొగలు మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చి, ఏకంగా నాలుగు బోగీలకు దహించివేశాయి.
రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఈ మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో బోగీల్లో ఉన్నవారంతా గట్టిగా కేకలు వేశారు. అయితే, లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలును వెంటనే నిలిపివేయడంతో ఒక పెద్ద ముప్పు తప్పింది. రైలు ఆగీ ఆగడంతోనే ప్రయాణికులు తమ సామాన్లను వదిలేసి, కిటికీలు, తలుపుల గుండా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు మరియు ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు ఐదు నుండి ఆరు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి.
అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొద్దిమందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది, వారికి సమీప ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే సాంకేతిక బృందం పరిశీలన చేస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, బోగీల్లోని విద్యుత్ వైరింగ్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతానికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రైల్వే రెస్క్యూ టీమ్ ప్రమాదానికి గురైన నాలుగు బోగీలను మిగతా రైలు నుండి వేరు చేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ, దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ రూట్లో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో, దానిని పునరుద్ధరించడానికి మరో కొన్ని గంటల సమయం పట్టేలా కనిపిస్తోంది.
