రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచ, గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చి గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
రాజస్థాన్ నాగోర్‌లో బాణాసంచా, గన్‌పౌడర్ తయారీ గోదాంలో ఒక్కసారిగా ఊహించని రీతిలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. గోదాంలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ టీమ్‌లు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ పేలుడు సృష్టించిన శబ్దం, ప్రకంపనలు కేవలం ఆ గోదాంకు మాత్రమే పరిమితం కాలేదు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఆ భారీ శబ్దం స్పష్టంగా వినిపించింది. ఆ ప్రాంతంలోని నివాస గృహాల కిటికీల అద్దాలు, గోడలు ఒక్కసారిగా కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిందేమోనని భ్రమించి ఇళ్లలో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కొద్దిసేపటి వరకు ఏం జరుగుతుందో అర్థంకాక ఆ ప్రాంతమంతా గందరగోళ వాతావరణం నెలకొంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. గన్‌పౌడర్ నిల్వలు ఉండటం వల్ల మంటలు వేగంగా పక్క ప్రాంతాలకు పాకే ప్రమాదం ఏర్పడింది. అయినప్పటికీ ఫైర్ సిబ్బంది ఎంతో సాహసం చేసి, రక్షణ చర్యలు చేపట్టి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాయి.
ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా జనవాసాల మధ్య ఇలాంటి ప్రమాదకరమైన గన్‌పౌడర్ గోదాంలను ఎందుకు నిర్వహిస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా సేఫ్టీ రూల్స్ పాటించడంలో వైఫల్యం చెందారా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. దోషులకు తగిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు పునరవృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.
