అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమితో పసిడి ధరల్లో భారీ కుదుపు చోటుచేసుకుంది. ధరలు ఉన్నట్లుండి ఒక్కరోజే భారీగా పుంజుకునున్నాయి. దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పండకి గోల్డ్, సిల్వర్ కొనాలనుకునేవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
దీపావళికి ముందే బంగారం ధరలు భారీగా షాకిచ్చాయి. ధరలు ఊహించని రీతిలో పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో దీపావళికి పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పెద్ద షాకింగ్ పరిణామంగా చెప్పవచ్చు.
దీపావళి పండక్కి బంగారం కొనుగోలు చేద్దామని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ గణాంకాలు నిజంగానే షాక్ ఇచ్చాయి. ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే… బంగారం ధరల్లో భారీ ర్యాలీ మొదలైంది. ఒక్కరోజే పసిడి ధరలు ఏకంగా రూ.3వేల220 వరకు ఎగబాకాయి!
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే… ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్ష,46వేల20 వద్ద ట్రేడవుతోంది. అంటే 24 క్యారెట్ల బంగారంపై ఒక్కరోజే 3వేల 220 రూపాయలు పెరిగింది… ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్షా33వేల 850 వద్ద కొనసాగుతుండగా, కేవలం ఒక్కరోజే ఇది రూ.2వేల950 పుంజుకుంది. సోమవారం నుంచి ఎలాంటి బ్రేకులు లేకుండా దూసుకెళ్తున్న ఈ గోల్డ్ రేట్లు… పండగ సమయానికి సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లే పడేలా చేస్తున్నాయి.
ఇక అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవిచూడటంతో, అమెరికా రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ట్రంప్ విధానాలకు భిన్నమైన పరిస్థితులు రాబోతున్నాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ భారీగా పతనమైంది. డాలర్ బలహీనపడినప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డాలర్ నుంచి సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లిస్తారు. అందులో మొదటి స్థానంలో ఉండేది బంగారమే! దీంతో పసిడికి ఒక్కసారిగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరోపక్క ట్రంప్ ఓటమితో డాలర్ విలువ పడిపోవడం, తక్కువ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్‌కు మద్దతు లభించడం జరిగిపోయాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 0.1 శాతం పెరిగి, ప్రస్తుతం ఔన్సుకు 3వేల 931.24 డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరిగితే, ఆటోమేటిక్‌గా మన దేశంలోనూ దాని ప్రభావం కనిపిస్తుంది. మరోపక్క ఎన్నికల ఫలితాల కారణంగా మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వాతావరణం ఏర్పడింది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో… ఇన్వెస్టర్లు, పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు తమ డబ్బును స్టాక్స్‌లో పెట్టడానికి భయపడుతున్నాయి. నష్టాల భయం లేని ‘బంగారం’పై పెట్టుబడులు పెట్టడమే అత్యంత సురక్షితమని భావించడంతో… కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
దీపావళి పండగ అంటే మన దేశంలో బంగారం కొనడం ఒక సెంటిమెంట్. ప్రతి ఏడాదీ ఈ సమయంలో మహిళలు, కుటుంబ సభ్యులు చిన్నదో పెద్దదో బంగారు ఆభరణం లేదా వెండి నాణేలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కాని, ఈసారి ధరలు చుక్కలను తాకడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనుగోలు చేయడం భారంగా మారింది. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం… ధరలు ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ, పండగ సెంటిమెంట్ కారణంగా కొనుగోళ్లు మాత్రం ఒక మోస్తరుగా స్థిరంగానే ఉంటాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, గతంలో కొనే బడ్జెట్‌లో ఇప్పుడు సగం తూకమే వస్తుండటంతో కొనుగోలుదారులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి చూస్తే… అమెరికా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఓటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో, మన జేబులపై ఆ ప్రభావం ఎంత గట్టిగా పడుతుందో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి పసిడి ధరలు మరింత హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండగ వేళ బంగారం కొనాలనుకునేవారు మార్కెట్ ట్రెండ్స్‌ను గమనించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.
