సోషల్ మీడియా మోజు, చిన్నపాటి ఆవేశం.. ఒక నిండు కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టేసింది. గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రీల్స్ చేయడంపై భర్త మందలించాడనే చిన్న కారణంతో, మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
మృతురాలిని నాగులగారి తేజగా గుర్తించారు. తేజ స్వస్థలం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామం. ఆమెకు గజ్వేల్‌కు చెందిన గోపాలరెడ్డితో వివాహమైంది. ప్రస్తుతం వీరు గజ్వేల్ పట్టణంలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే తేజ ప్రతిరోజూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ చేసేదని.. ఇక నుంచి రీల్స్ చేయవద్దని, కుటుంబంపై దృష్టి పెట్టాలని భర్త గోపాలరెడ్డి పలుమార్లు తేజను మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భర్త మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తేజ.. ఆవేశంలో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది
సమాచారం అందుకున్న గజ్వేల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా మోజు, చిన్నపాటి ఆవేశం.. ఒక నిండు కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టేసింది. దీంతో పాటు తల్లి లేని ఆ పసిపిల్లల రోదనలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేస్తున్నాయి.
