సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ దాటి సామాన్య కార్యకర్తలా అంతిమ యాత్రలో నడవడమే గొప్ప విషయం, అలాంటిది ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యే పాడెను స్వయంగా భుజాన మోసి కన్నీటి వీడ్కోలు పలికారు తమిళనాడు సీఎం, టీవీకే అధినేత దళపతి విజయ్. కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం వీడ్కోలు పలికారు. దీని కంటే ముందు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తమిళనాడు అధికార పార్టీ టీవీకే సీనియర్ నేత, కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే సీఎం విజయ్ శుక్రవారం వీఎస్ బాబు నివాసానికి చేరుకుని, ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శోకసంద్రంలో మునిగిపోయిన బాబు కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించి, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం శుక్రవారం చెన్నైలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీఎస్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాది మంది టీవీకే కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అందరితో పాటు సామాన్యుడిలా నడిచిన ముఖ్యమంత్రి విజయ్, స్వయంగా వీఎస్ బాబు పాడెను తన భుజాన మోసి తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. తన పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతకు సీఎం స్వయంగా అంతిమ వీడ్కోలు పలకడం అక్కడున్న వారందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.
ఉత్తర చెన్నై రాజకీయాల్లో సీనియర్ నేతగా వీఎస్ బాబుకు ఎంతో పేరుంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరిన ఆయన, అత్యంత కీలకమైన కొలత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆయన సొంత ఇలాకా కొలత్తూరులోనే 8,795 ఓట్ల మెజారిటీతో ఓడించి ‘జెయింట్ కిల్లర్’గా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించారు. ఆ చారిత్రాత్మక విజయమే తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చివేసింది.
వీఎస్ బాబు మరణం పట్ల మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒక పోరాట యోధుడిని కోల్పోయామని టీవీకే శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే వీఎస్ బాబు అకాల మరణంతో కొలత్తూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆసక్తి నెలకొంది.
