పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కలిసి పిఠాపురంలో అడుగుపెట్టడం స్థానికంగా పెద్ద సందడిని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఉపాసన చేసిన ఒక స్పెషల్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు పిఠాపురంలో జరిగిన ఆ గ్రాండ్ ఈవెంట్ ఏంటి? ఉపాసన అక్కడి ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడారు?
కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారం గ్రామంలో అపోలో ఫౌండేషన్, టోటల్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ‘అపోలో ఆరంభ్ మోడల్ అంగన్వాడీ’ కేంద్రం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీతో పాటు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వీరిద్దరూ కలిసి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటించి, కేంద్రంలోని ఆధునిక వసతులను పరిశీలించారు.
ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉపాసన కామినేని ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ మీ అందరికీ ‘పవర్ స్టార్’ కావచ్చు, కానీ తనకు మాత్రం ఆయన ‘ఎంపవర్ స్టార్’ అంటూ ఆమె ప్రశంసలు కురిపించారు. ఉపాసన పోగడడంతో సభలో ఒక్కసారిగా ఈలలు, చప్పట్లు మార్మోగాయి. చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం, సమాజ సాధికారత కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ఉపాసన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. పిఠాపురం గడ్డపై అడుగుపెట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు.
చిన్నారులకు చిన్నతనం నుంచే మెరుగైన విద్య, నాణ్యమైన పోషకాహారం, ఉత్తమ ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉదాత్త లక్ష్యంతో ఈ అపోలో ఆరంభ్ మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల సంక్షేమానికి, పిల్లల భవిష్యత్తుకు ఈ మోడల్ సెంటర్ ఎంతో దోహదపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పిఠాపురం అభివృద్ధిలో అపోలో ఫౌండేషన్ భాగస్వామ్యం కావడం ఒక గొప్ప ముందడుగుగా చెప్పుకోవచ్చు.
