భయంతో పరుగు తీసిన రైతు
నేరడ గంగమ్మ గుడి సమీపంలో ఘటన
ఫారెస్ట్ సిబ్బందికి సర్పంచ్ సమాచారం
స్థానికుల సాయంతో కొండచిలువ పట్టివేత
పచ్చని పంట పొలాల్లోకి అడుగుపెట్టిన ఓ రైతుకు ఊహించని షాక్ తగిలింది. రోజూ లాగే పని చేసుకుందామని చేనులోకి వెళ్లిన ఆ రైతుకు.. కళ్లెదుటే ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. ఆ దృశ్యం చూసి గుండె ఆగినంత పనైన ఆ రైతు, ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఇంతకీ ఆ భారీ కొండచిలువ ఎక్కడ ప్రత్యక్షమైంది? కదలలేని స్థితిలో ఉన్న ఆ కొండచిలువను ఫారెస్ట్ సిబ్బంది ఎలా బంధించారు? ఆ గ్రామస్తులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఇప్పుడే చూద్దాం..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామంలోని గంగమ్మ గుడి సమీపంలో ఉన్న ఓ రైతు పంట చేనులో ఈ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఎప్పటిలాగే తన పొలం పనుల కోసం చేనులోకి వెళ్లిన రైతు, కళ్ల ముందే అంత పెద్ద కొండచిలువను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం చేయాలో తోచక భయంతో బయటకు పరుగు పెట్టాడు. వెంటనే తేరుకున్న రైతు ఈ విషయాన్ని నేరడ గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీకి తెలిపాడు. ఏమాత్రం ఆలస్యం చేయని సర్పంచ్ నేతాజీ, వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న స్థానికుల సాయంతో, ఫారెస్ట్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను బంధించారు. అయితే, ఆ కొండచిలువ ఏదైనా పెద్ద జంతువును మింగి ఉండొచ్చని, అందుకే కదలలేని స్థితిలో ఉందని ఫారెస్ట్ సిబ్బంది భావిస్తున్నారు. ఆహారం తిన్న తర్వాత విశ్రాంతి తీసుకునేందుకే అది ఇలా పంట చేనులోకి వచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఎట్టకేలకు కొండచిలువ చిక్కడంతో సదరు రైతుతో పాటు చుట్టుపక్కల పొలాల రైతులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనతో నేరడ గ్రామస్తుల్లో కొత్త చర్చ మొదలైంది. తమ ప్రాంతంలో గతంలో ఎన్నడూ కొండచిలువల ఆనవాళ్లే లేవని, అసలు ఇంత భారీ కొండచిలువ ఎక్కడి నుంచి వచ్చిందో అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచో లేక వాగుల వెంబడి కొట్టుకువచ్చిందో అని చర్చించుకుంటున్నారు.
చూశారు కదా.. పట్టుబడిన ఆ భారీ కొండచిలువను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా దట్టమైన అడవిలోకి వదిలిపెట్టేందుకు తీసుకెళ్లారు. అయితే, పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
