ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార తయారీ సంస్థలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. నవంబర్ 19న నగరంలోని పలు ప్రాంతాల్లో TG SAFE అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రముఖ సంస్థ ‘కరాచీ బేకరీ’తో పాటు పలు మాంసం విక్రయ కేంద్రాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని CURE పరిధిలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై TG SAFE అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 11 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 19 సంస్థల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. వీటిలో 15 మాంసం విక్రయ ప్రాసెసింగ్ కేంద్రాలు, 4 కరాచీ బేకరీ తయారీ యూనిట్లు ఉన్నాయి.
తనిఖీల సమయంలో అధికారులకు అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపించాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, నిల్వలు, ఎక్కడ చూసినా పురుగుల బెడద.. వీటికి తోడు గడువు ముగిసిన ఆహార పదార్థాలు, లేబుల్స్ లేని ఉత్పత్తులు, తప్పుడు లేబులింగ్‌తో పాటు తప్పనిసరి రికార్డుల నిర్వహణలో తీవ్ర లోపాలను అధికారులు గుర్తించారు. ఇక ఈ తనిఖీల్లో అత్యంత కీలకమైన అంశం బయటడపింది. ప్రముఖ బ్రాండ్ ‘కరాచీ బేకరీ’లో బయటపడ్డ అక్రమాలు. గగన్‌పహాడ్‌లోని కరాచీ బేకరీ పెర్ల్ ప్రైవేట్ లిమిటెడ్ తయారీ కేంద్రంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా, లేబులింగ్‌లో జరుగుతున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
అక్టోబర్ నెలలో తయారైన ఆహార ఉత్పత్తులపై.. ఏకంగా నవంబర్ నెలలో తయారైనట్లుగా కొత్త లేబుల్స్ ముద్రించి విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఈ చర్యపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడున్న సుమారు 1,012 కిలోల ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఇక్కడ సీజ్ చేసిన సరుకు విలువే 4 లక్షల 34 వేల 813 రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
పేరున్న సంస్థలే ఇలా తప్పుడు తేదీలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, ఇక సామాన్యులు ఏం నమ్మి కొనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
మొత్తంగా ఈ 19 సంస్థల్లో జరిగిన తనిఖీల్లో సుమారు 1,672 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని, పనికిరాని వాటిని అక్కడికక్కడే పారవేశారు. వీటి మొత్తం విలువ 6 లక్షల 59 వేల 213 రూపాయలుగా అంచనా వేశారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన ఆరు సంస్థల FSSAI లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేసి, తక్షణమే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, అసలు లైసెన్సులే లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న మరో ఐదు సంస్థలను అధికారులు పూర్తిగా మూసివేశారు. అదనంగా 10 సంస్థలకు షోకాజ్ నోటీసులు, మరో రెండు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు.
