సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. చౌటకూరు మండలం కొర్పోల్‌కు చెందిన సరిత అమీన్పూర్–చందానగర్ రోడ్డులో కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తోంది. కుమార్తె అక్షితకు ఫోన్ ఇచ్చి పని నిమిత్తం పక్కింటికి వెళ్లింది. 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి పాప కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషాదకరమైన ఇన్సిడెంట్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. చౌటకూరు మండలం కొర్పోల్ గ్రామానికి చెందిన సరిత అనే మహిళకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే గతేడాది సరిత భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆ కుటుంబం రోడ్డున పడింది. పిల్లల భవిష్యత్తు కోసం ధైర్యం తెచ్చుకున్న సరిత, అమీన్పూర్ – చందానగర్ ప్రధాన రహదారిలోని సమ్మక్క-సారక్క ఆలయ సమీపంలో ఉన్న ఆర్ఆర్ హోమ్స్ వద్ద నివాసం ఉంటోంది. అక్కడే రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ, తన రెక్కల కష్టంతో ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఉన్నంతలో ప్రశాంతంగా సాగిపోతున్న ఆ చిన్న కుటుంబంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం ఉదయం ఎప్పటిలాగే సరిత తన పెద్ద కుమార్తెను స్కూల్‌కు పంపించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో, తన రెండున్నరేళ్ల చిన్న కుమార్తె అక్షితను ఇంట్లో ఉంచి, పాప అల్లరి చేయకుండా ఉండేందుకు చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఏదో చిన్న పని నిమిత్తం సరిత పక్కింటికి వెళ్లి, కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే తిరిగి తన ఇంటికి వచ్చింది. కానీ ఇంటికి వచ్చి చూసేసరికి, అక్కడ ఉండాల్సిన చిన్నారి అక్షిత కనిపించలేదు. ఒక్కసారిగా ఆందోళనకు గురైన సరిత, పాప ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్లిందేమోనని ఇల్లంతా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించింది. స్థానికులను విచారించినా, ఎక్కడ వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. దీంతో తన బిడ్డ కిడ్నాప్‌కు గురైందని గ్రహించిన ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వెంటనే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
చిన్నారి కిడ్నాప్ ఫిర్యాదు అందగానే అమీన్పూర్ పోలీసులు తక్షణమే స్పందించారు. సీఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు ముందుగా ఆ ప్రాంతంలోని స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ విజువల్స్ చూసిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. సరిత పక్కింటికి వెళ్లిన సమయంలో, ఒక గుర్తుతెలియని మహిళ అక్కడికి వచ్చి, చిన్నారి అక్షితను తనతో పాటు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ మహిళ ఎవరు? ముందు నుండే రెక్కీ నిర్వహించి పాపను ఎత్తుకెళ్లిందా? లేక పిల్లలను దొంగిలించే ముఠాకు చెందిన వ్యక్తా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ గుర్తుతెలియని మహిళ వెళ్లిన రూట్ మ్యాప్‌ను పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. త్వరలోనే నిందితురాలిని పట్టుకుని, చిన్నారి అక్షితను క్షేమంగా తల్లి ఒడికి చేరుస్తామని సీఐ ప్రవీణ్ రెడ్డి భరోసా ఇచ్చారు. అయితే ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి, ఇంటి తలుపులు తెరిచి ఉంచి ఒక్క క్షణం కూడా పక్కకు వెళ్లకూడదని ఈ ఇన్సిడెంట్ స్పష్టం చేస్తోంది.
