ఇప్పటికే అర్నాబ్, మురసు తుఫాన్ల దెబ్బకు ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ షాక్ నుండి కోలుకోకముందే, బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తీవ్ర తుఫాన్ నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకురావడంతో రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారిగా వణికిపోయారు. అయితే, ప్రకృతి కరుణించిందో ఏమో కానీ, అక్వాన్ తుఫాన్ చివరి నిమిషంలో తన రూట్ మార్చుకుంది. దీంతో ఏపీకి పెను విధ్వంసం తప్పినట్లే అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి ఈ తుఫాన్ ఎటువైపు వెళ్తోంది? ఎప్పుడు, ఎక్కడ తీరం దాటనుంది? ఏపీలో ఏయే జిల్లాలపై దీని ప్రభావం ఉండబోతోంది?
వాస్తవానికి మొదట అక్వాన్ తుఫాన్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు – తుని మధ్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ అదే జరిగి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఊహించని విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తీవ్ర తుఫాన్ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా తీరం వైపు ప్రయాణిస్తోంది. గత 6 గంటలుగా ఇది గంటకు కేవలం 5 కిలోమీటర్ల అతి నెమ్మదైన వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కదలికలను బట్టి చూస్తే, ఉత్తర-వాయవ్య దిశగా పయనించి రేపు మధ్యాహ్నానికల్లా ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాల మధ్య… ముఖ్యంగా నరసాపురం – పూరీల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఈ తుఫాన్ ప్రస్తుత పొజిషన్, తీవ్రత గురించి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతానికి అక్వాన్ తుఫాన్ నరసాపురానికి 470 కిలోమీటర్లు, కళింగపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు, అలాగే ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 580, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ ఒక ఊరటనిచ్చే విషయం ఏంటంటే… తుఫాన్ సముద్రంలో చాలా నెమ్మదిగా కదులుతుండటం వల్ల కొంతమేర బలహీనపడింది. మొదట ఇది ‘అతి తీవ్ర తుఫాన్’గా మారుతుందని భావించినప్పటికీ, ఇప్పుడు ‘తీవ్ర తుఫాన్’గానే తీరం దాటనుంది. అయినప్పటికీ, ల్యాండ్‌ఫాల్ సమయంలో గాలి వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్లు, ఒక్కోసారి గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుఫాన్ ఒడిశా వైపు మళ్లినప్పటికీ, దాని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై గట్టిగానే ఉండబోతోంది. ఏపీఎస్డీఎంఏ అంచనాల ప్రకారం, ఈ రోజు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాకుండా, శుక్రవారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది.
తీరం దాటే సమయానికి తుఫాన్ ఇంకాస్త దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే శ్రీకాకుళం, టెక్కలి, పలాసలలో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విజయనగరంలో 1 ఎస్డీఆర్ఎఫ్ బృందం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, సీతంపేటలలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. మొత్తంగా 5 ఎన్డీఆర్ఎఫ్, 1 ఎస్డీఆర్ఎఫ్, స్థానిక ఫైర్ సేఫ్టీ టీమ్స్ గ్రౌండ్ లెవల్లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
