కాపురంలో కలహాలు… నిత్యం తాగి వచ్చి చేసే వేధింపులు… చివరికి ఆ ఇంట జరిగిన గొడవ ఒక ప్రాణాన్ని బలితీసుకుంది! పిల్లలు లేరన్న ఒక్క కారణంతో… భార్యను అనుక్షణం నరకం చూపించిన భర్త రాజశేఖర్ కథ కంచికే చేరింది. భర్త అరాచకాలను భరించలేక… చివరికి ఆ ఇల్లాలు మాలాశ్రీ వంటింట్లోని కత్తితో భర్తనూ కడతేర్చింది. బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన ఈ దారుణ హత్య…స్థానికంగా కలకలం రేపుతుంది…
ఇక ఈ దారుణం జరిగింది కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడనగర పరిధిలోని లక్ష్మీపురలో. ఇక్కడ రాజశేఖర్ , మాలాశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రాజశేఖర్ స్థానిక బ్యాంకులో లోన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బయట చూసే వారికి వారి జీవితం సాధారణంగానే సాగిపోతున్నట్లు కనిపించినా… ఇంటి నాలుగు గోడల మధ్య మాత్రం ప్రతిరోజూ ఒక నరకయాతన కొనసాగుతూనే ఉంది. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా వారికి సంతానం కలుగలేదు. ఈ ఒక్కటే ఆ కుటుంబంలో పెను శాపంగా మారింది. సమాజంలో పరువు కోసం బతుకుతున్న ఆ దంపతుల మధ్య, లోలోపల ఈ సమస్య తీవ్రమైన అశాంతిని రాజేసింది. సంతానం కలగలేదన్న నిరాశను రాజశేఖర్ జీర్ణించుకోలేకపోయాడు. దానికి తోడు రోజువారీ జీవితంలోని ఒత్తిళ్లు, వ్యసనాలు అతడిని పూర్తిగా మార్చేశాయి. ప్రతిరోజూ రాత్రి పూట ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి రావడం… భార్య మాలాశ్రీని నిందించడం అతనికి దినచర్యగా మారింది.
అంతేకాదు… మనుషులను క్షణంలో కుంగదీసే మాటలతో అతను రెచ్చిపోయేవాడు. ‘నీవల్ల సంతానం కలగలేదు.. నువ్వు గొడ్రాలివి’ అంటూ పదే పదే ఆమెను మానసికంగా తీవ్రంగా వేధించేవాడు. భార్యగా ఆమె పడుతున్న వేదనను ఏమాత్రం పట్టించుకోకుండా, ఒంటరితనాన్ని మరింత క్షోభ పెట్టేలా రోజుకో విధంగా వేధింపులకు గురిచేసేవాడు.అయిన ఆ భార్య భరిస్తూ వచ్చింది..
ఆ రోజుకూడా రోజులానే గొడవ మొదలైంది.. కానీ ఈ సారి వాగ్వాదం తారస్థాయికి చేరింది.. రాత్రి రాజశేఖర్ ఎప్పటిలాగే ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. సంతానం రాలేదనే పాత విషయాలనే మళ్లీ తిరగదోడుతూ మాలాశ్రీతో తీవ్రస్థితిలో గొడవకు దిగాడు. మాటలు కాస్తా పెరిగి పెద్దవి కావడంతో ఆ ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిత్యం తనను కుళ్ళబొడుస్తున్న ఆ మాటలను భరించలేకపోయిన మాలాశ్రీ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైంది. అప్పటివరకు అణచిపెట్టుకున్న కోపమంతా కట్టలు తెంచుకుంది. క్షణికావేశంలో నేరుగా వంటింట్లోకి పరుగెత్తికెళ్లిన ఆమె.. అక్కడ ఉన్న పదునైన కత్తిని తీసుకువచ్చి భర్త రాజశేఖర్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది! దీంతో భర్త రాజశేఖర్ ప్రాణాలు విడిచారు..మరోపక్క స్థానికులు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భార్య మాలాశ్రీని అదుపులోకి తీసుకున్నారు…
