వెండితెరపై తన యాక్టింగ్‌తో అలరించే సినీ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి ఇప్పుడు బిజినెస్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కేవలం ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో వీరి స్టార్టప్ ‘నమస్తే వరల్డ్’ ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అసలు ఈ ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ ఏంటి? ఎక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు?
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సువేదికగా అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో సినీ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి కలిసి స్థాపించిన ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక MOU కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.36 కోట్ల పెట్టుబడితో ఒక నూతన పరిశ్రమను స్థాపించేందుకు ఈ అగ్రిమెంట్ జరిగింది. ఒక పారిశ్రామికవేత్త హోదాలో, ‘నమస్తే వరల్డ్’ ఫౌండర్‌గా భూమా మౌనిక రెడ్డి స్వయంగా ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేయడం విశేషం.
ఇక ఈ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనే విషయానికి వస్తే.. రాయలసీమలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు ఇందుకు వేదికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం చాలా ప్రత్యేకమైనది. విదేశీ బొమ్మలకు బదులుగా, మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పిల్లల ఆటబొమ్మలు, అద్భుతమైన హస్తకళా ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నారు. తద్వారా కనుమరుగవుతున్న స్వదేశీ కళాకారులకు భారీ ఎత్తున ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలు అందించాలని ఈ జంట లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం భూమా మౌనిక రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. సీఐఐ సదస్సు ద్వారా దేశంలోని ఎంతో మంది హస్తకళాకారులు, యువ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. స్థానిక కళాకారులు, కొత్త స్టార్టప్‌లు తయారు చేసే ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ అవకాశాలు కల్పించడంలో ఇలాంటి సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నిర్వాహకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, మన దేశీయ కళాకారులను ప్రోత్సహించేలా ‘నమస్తే వరల్డ్’ పేరుతో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వేసిన ఈ అడుగుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఓర్వకల్లులో ఈ పరిశ్రమ ప్రారంభమైతే స్థానిక యువతకు, కళాకారులకు ఎంతో మేలు జరగనుంది. మరి పారిశ్రామికవేత్తలుగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మంచు మనోజ్, భూమా మౌనిక జంటకు పలువురు విషెష్ చెబుతున్నారు.
