రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నంద్యాల జిల్లాలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల భవిష్యత్తు తేలే కీలక సమయంలో, పాత ముచ్చుమర్రిలోని సిద్ధార్థ్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు ఇనుప రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఫలితాల వేళ ఆయన బయటకు వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ముందస్తు భయంతోనే పోలీసులు ఈ చర్యకు దిగినట్లు స్పష్టమవుతోంది.
పరిషత్ ఎన్నికల్లో ఓట్లు పడిన క్షణం నుండి నేడు బాక్సులు తెరుచుకునే వరకు ప్రతి ఘట్టంలోనూ తీవ్ర హైడ్రామా నడుస్తోంది. ఒకవైపు కౌంటింగ్ కేంద్రాల్లో రౌండ్ల వారీగా ఫలితాలు వెలువడుతుంటే, మరోవైపు సిద్ధార్థ్ రెడ్డి అనుచరులు, వైసీపీ శ్రేణులు పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కౌంటింగ్ ఏజెంట్లను ప్రభావితం చేయడానికి, గెలిచే స్థానాల్లో కూడా వైసీపీని అణగదొక్కడానికే అధికార కూటమి ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షం గళమెత్తుతోంది. సిద్ధార్థ్ రెడ్డిని గదికే పరిమితం చేసి, నంద్యాల పరిధిలోని కౌంటింగ్ రూముల్లో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగుతున్నాయి.
కౌంటింగ్ రోజున కూడా తనను ఇలా బంధించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు సిద్ధార్థ్ రెడ్డి. మ అభ్యర్థులు గెలుస్తున్నారనే భయంతోనే కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా ఈ హౌస్ అరెస్టులు సాగుతున్నాయని ఆరోపించారు. ఈ రెండేళ్లలో ఏమైనా చేసుకోండని..తన గొంతు మాత్రం నొక్కలేరన్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ హాల్స్ వద్ద ఉత్కంఠ క్షణక్షణానికి పెరుగుతోంది. ఫలితాల సరళి ఎలా ఉన్నప్పటికీ, సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్ అంశం కౌంటింగ్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు గెలుపు సంబరాలు, మరోవైపు అరెస్టుల నిరసనలతో ఫ్యాక్షన్ గడ్డపై రాజకీయం మునుపెన్నడూ లేనంతగా రగులుతోంది. పోలీసులు మాత్రం శాంతిభద్రతల సమస్య రాకుండా లెక్కింపు ముగిసే వరకు సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్‌లోనే ఉంచుతామని స్పష్టం చేస్తున్నారు.
