చదువు చెప్పాల్సిన గురువే కామాంధుడిగా మారితే ఆ పసిపిల్లల పరిస్థితి ఏమిటి? అమ్మలా కాపాడాల్సిన పాఠశాలే భయానక వాతావరణంగా మారితే పిల్లల భవిష్యత్తు ఎటు పోవాలి? చిత్తూరు జిల్లా వి.కోటలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ఒక టీచర్ చేస్తున్న వికృత చేష్టలు, వాటిని కప్పిపుచ్చేందుకు హెడ్మాస్టర్ చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
చిత్తూరు జిల్లా వి.కోట బాలికల జడ్పీ హైస్కూల్‌లో రమేష్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆడపిల్లలపై వేయరాని చోట చేతులు వేయడం, అసభ్యకరమైన సైగలు చేయడం, నిత్యం బూతు మాటలు మాట్లాడుతూ విద్యార్థినులను మానసికంగా తీవ్ర వేదనకు గురిచేస్తున్నాడు. పవిత్రమైన బడిని కాస్తా తన వికృత చేష్టలకు అడ్డాగా మార్చుకున్నాడు ఈ కీచక గురువు.
ఈ ఘాతుకం ఇవాళ నిన్నటిది కాదు. రమేష్ విధుల్లో చేరిన నాటి నుంచి, అంటే గత మూడేళ్లుగా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాడట. గతంలో కూడా ఇదే పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఇలాగే అసభ్యంగా ప్రవర్తించడంతో, అప్పట్లో ఉన్నతాధికారులు అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. తిరిగి మళ్లీ అదే స్కూల్‌కు పోస్టింగ్ తెచ్చుకున్నాక కూడా అతని బుద్ధి మాత్రం మారలేదు. పాత పద్ధతినే కొనసాగిస్తూ మరింత రెచ్చిపోతున్నాడు.
ఈ దారుణాలపై బాధితులు ఎంతో ధైర్యం చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. తప్పు చేసిన ఉపాధ్యాయుడిని మందలించాల్సింది పోయి, హెడ్మాస్టరే స్వయంగా అతన్ని వెనకేసుకొస్తూ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. స్కూల్‌కు వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుడుతోందని, పాఠశాలలో తమకు అసలు రక్షణే లేదని వాపోతున్నారు.
పిల్లల పరిస్థితిని చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. నేరుగా జిల్లా కలెక్టర్‌కు, విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో ఉప-విద్యాశాఖ అధికారి రంగంలోకి దిగి పాఠశాలలో విచారణ చేపట్టారు. అయితే, కేవలం విచారణతో సరిపెట్టకుండా.. విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఉపాధ్యాయుడు రమేష్‌ను, అతనికి అండగా నిలుస్తున్న హెడ్మాస్టర్‌ను వెంటనే సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని తల్లిదండ్రులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
