రన్ వేపై నుంచి ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా ‘హైజాక్’ హెచ్చరిక రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందంటూ రాసిన ఒక అజ్ఞాత భయాందోళనకర లేఖ లభించడంతో విమానాశ్రయం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అనుమానాస్పద లేఖను గమనించిన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తపినట్లయింది.
బుధవారం ఉదయం వేళ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి మహారాష్ట్రలోని ముంబైకి బయలుదేరడానికి ఎయిర్ ఇండియా విమానం సిద్ధంగా ఉంది. ప్రయాణికులు విమానంలోకి ఎక్కి టేకాఫ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, అనుమానాస్పదంగా ఉన్న ఒక లేఖను విమానంలో గుర్తించారు. అందులో విమానాన్ని హైజాక్ చేస్తామనే సంచలన హెచ్చరిక ఉంది. లేఖను చూసిన వెంటనే తీవ్రంగా స్పందించిన పైలట్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు అత్యవసర రేడియో సమాచారాన్ని అందించారు.
పైలట్ నుంచి హెచ్చరిక సమాచారం అందడమే తడవుగా ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు మెరుపు వేగంతో రెస్పాండ్ అయ్యారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రయాణికులతో ఉన్న ఆ విమానాన్ని వెంటనే ప్రధాన రన్ వే నుంచి ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ బేకు సురక్షితంగా తరలించారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందకుండా వారిని సురక్షితంగా కిందకు దింపి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విమానం నలుమూలలా క్షుణ్ణంగా సోదాలు ప్రారంభించారు.
హైజాక్ హెచ్చరిక నేపధ్యంలో కోల్‌కతా విమానాశ్రయం వ్యాప్తంగా సెక్యూరిటీని అత్యంత కట్టుదిట్టం చేశారు. విమానంలోని ప్రయాణికుల లగేజీతో పాటు ప్రతీ ఒక్కరినీ రీ-స్కాన్ చేస్తూ భద్రతా ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అసలు ఈ బెదిరింపు లేఖ ఎవరు రాశారు? విమానంలోకి ఇది ఎలా వచ్చింది? లేదా ప్రయాణికుల్లో ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా? అనే కోణాల్లో సిసిటివి ఫుటేజ్ ఆధారంగా అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. విమానంలో ఏదైనా ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
మొత్తానికి పైలట్ చాకచక్యం, అధికారుల తక్షణ చర్యల వల్ల ఎయిర్ ఇండియా విమానంలో సంభవించబోయే పెద్ద ముప్పు తృప్తిలో తప్పిందని చెప్పవచ్చు. భద్రతా తనిఖీలు పూర్తిగా పూర్తయిన తర్వాతే విమాన ప్రయాణానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ బెదిరింపు లేఖపై ఎయిర్‌పోర్ట్ అధికారులు, పోలీసుల దర్యాప్తు ముగిసిన అనంతరం పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
