‘ఏఐ’ వచ్చింది, ఇక మనుషుల ఉద్యోగాలన్నీ పోయాయి, ఇక భవిష్యత్ మొత్తం ఏఐ యే అంటూ గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రచారం జరిగింది. ఈ హైప్‌ను నమ్మి ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేశాయి. కానీ, ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏఐ కన్నా మనుషులే మిన్న అని ఆ కంపెనీలకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం అయింది. తాము తొలగించిన పాత ఉద్యోగులను మళ్లీ తిరిగి రమ్మంటూ ఇప్పుడు ఆ కంపెనీలే బతిమిలాడుతున్నాయట. అసలు కార్పొరేట్ ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఏఐ ఎక్కడ ఫెయిల్ అయింది? గూగుల్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు తీసుకుంటున్న కొత్త నిర్ణయాలేంటి..?
కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనే ఆశతో, ఉద్యోగుల స్థానంలో ఏఐ సాఫ్ట్వేర్లు, చాట్బాట్లను రంగంలోకి దించాయి. కానీ, ఆశించిన ఫలితాలు రాకపోగా.. ఏఐ మెయింటెనెన్స్ ఖర్చులు, అది చేసే తప్పులను సరిదిద్దే ఖర్చులు తడిసి మోపెడయ్యాయని కంపెనీలు గ్రహించాయి. ఏకంగా 31 కంపెనీలు ఏఐ నిర్వహణ ఖర్చుల వల్ల లాభాలకు బదులు నష్టాలను చవిచూశాయి. ప్రముఖ పరిశోధనా సంస్థలు ‘ఫారెస్టర్’, ‘ఆర్గ్యూ’ నివేదికల ప్రకారం.. ఏఐ కోసం ఉద్యోగులను తొలగించిన యజమానుల్లో 55 శాతం మంది తమ నిర్ణయం తప్పని అంగీకరిస్తున్నారు. అంతేకాకుండా, హెచ్ఆర్ సంస్థ ‘ఎస్హెచ్ఎల్’ తాజా సర్వే ప్రకారం, ఏఐ వల్ల ఉద్యోగం కోల్పోయిన ప్రతి ఐదుగురిలో ఒకరిని కంపెనీలు తిరిగి ఆహ్వానించాయి. తొలగింపులు జరిగిన ఆరు నెలల్లోపే దాదాపు 70 శాతం కంపెనీలు మళ్లీ కొత్త నియామకాలు లేదా పాత ఉద్యోగులను వెనక్కి పిలిచే పని మొదలుపెట్టాయి.
అసలు మనుషుల స్థానాన్ని ఏఐ ఎందుకు భర్తీ చేయలేకపోయింది అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కోడింగ్ రాయడంలో, కస్టమర్లతో మాట్లాడటంలో ఏఐ చాలా తప్పులు చేస్తోందట. ఆ తప్పులను సరిదిద్దడానికి మళ్లీ మనుషులే అవసరమవుతున్నారు. ముఖ్యంగా కస్టమర్ కోపంగా ఉన్నప్పుడు లేదా ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు.. ఒక మనిషిలా ఆలోచించి, వారిని ఓదార్చి, సరైన పరిష్కారం చూపే శక్తి యంత్రాలకు లేదని కంపెనీలకు అర్థమైంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయంలో మనుషులకు ఏఐ ఏమాత్రం సాటిరాదని తేలిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఇప్పుడు తమ పాత ఉద్యోగులను తిరిగి తీసుకుంటున్నాయి. స్వీడన్‌కు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ ‘క్లార్నా’ ఏఐ చాట్‌బాట్ రాకతో 700 మంది కస్టమర్ కేర్ ఉద్యోగులను తొలగించి, ఇప్పుడు తాజాగా మళ్లీ నియామకాలు చేపడుతోంది. అమెరికాలోని కార్ల తయారీ దిగ్గజ సంస్థ ‘ఫోర్డ్’ ఆటోమేటెడ్ సిస్టమ్స్‌పై నమ్మకంతో ఇంజనీర్లను తగ్గించింది కానీ, తయారీలో నాణ్యతా లోపాలను గుర్తించడంలో ఏఐ విఫలమవడంతో 300 మంది ఇంజనీర్లను తిరిగి తీసుకుంది. అలాగే, ‘కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా’ ఏఐ వాయిస్ బాట్ వల్ల కస్టమర్ల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తొలగించిన సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఇక ‘ఐబీఎం’ సుమారు 8,000 బ్యాక్ ఆఫీస్, హెచ్ఆర్ నియామకాలను నిలిపివేసి ఏఐ చాట్‌బాట్‌ను తెచ్చినా, అది విఫలమవడంతో మళ్లీ హెచ్ఆర్ నిపుణులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటోంది.
టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గూగుల్ 2025-26 మధ్య తీసుకున్న ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఏకంగా 20 శాతం మంది గతంలో కంపెనీ వదిలి వెళ్లిన లేదా తొలగించిన పాత ఉద్యోగులే కావడం విశేషం. మరోవైపు ‘అమెజాన్’ ఏఐ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో 30,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడటంతో పాత ఉద్యోగులను వెనక్కి పిలవాలని నిర్ణయించింది. మరి రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూడాలి మరి.
