తెలంగాణ పోలీస్ బాస్‌ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిపాలనలో, ముఖ్యంగా శాంతిభద్రతల విభాగంలో భారీ ప్రక్షాళనకు తెరలేపుతూ ఏకంగా 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అందరి కళ్లు ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కుర్చీలో కొత్త అధికారి అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ వీసీ సజ్జనార్ ఎక్కడికి బదిలీ అయ్యారు? హైదరాబాద్ కొత్త సీపీ ఎవరు? కీలక విభాగాలైన ఆర్టీసీ, ఏసీబీ, సివిల్ సప్లైస్ బాధ్యతలు ఎవరికి దక్కాయి?
ఈ బదిలీల్లో అత్యంత ప్రధానమైన మార్పు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇప్పటివరకు లా & ఆర్డర్ డీజీపీగా పనిచేస్తున్న 1995 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించింది. ఇక వీసీ సజ్జనార్‌కు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ డీజీగా పోస్టింగ్ ఇవ్వడంతో పాటు, SPF డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
కీలకమైన విభాగాల్లో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటివరకు జైళ్లు & కరెక్షనల్ సర్వీసెస్ డీజీగా ఉన్న డా. సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగం డీజీపీగా బదిలీ చేసింది. ఆమెకు ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. అలాగే, ఇప్పటివరకు ఆర్గనైజేషన్ & హోం గార్డ్స్ డీజీపీగా ఉన్న స్వాతి లక్రాను జైళ్లు & కరెక్షనల్ సర్వీసెస్ డీజీగా నియమిస్తూ, హోం గార్డ్స్ అదనపు బాధ్యతలను కొనసాగించింది. మరోవైపు, 1996 బ్యాచ్ అధికారిణి చారు సిన్హాను ACB డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ, సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రజా రవాణా, పౌరసరఫరాల వంటి కీలక సంస్థలకు కొత్త సారథులను నియమించింది ప్రభుత్వం. ఇప్పటివరకు ఆపరేషన్స్, గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ డీజీపీగా ఉన్న డా. అనిల్ కుమార్ ను TSRTC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా పనిచేసిన వై. నాగిరెడ్డిని సివిల్ సప్లైస్ కమిషనర్‌గా, సీఏఎఫ్ & సీఎస్ శాఖ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. దీనితో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీసీ & ఎండీగా, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక ఇప్పటివరకు సివిల్ సప్లైస్ కమిషనర్‌గా ఉన్న ఎం. స్టీఫెన్ రవీంద్రను హైదరాబాద్‌లోని తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేసింది.
మిగిలిన కీలక విభాగాల విషయానికి వస్తే.. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను ఏడీజీపీ, లా & ఆర్డర్‌గా నియమిస్తూనే, కోఆర్డినేషన్, టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీపీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అలాగే, ఇప్పటివరకు ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న విక్రమ్ సింగ్ మాన్ ను ఆపరేషన్స్, గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ డీజీపీగా బదిలీ చేసి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. చివరగా, టీజీఎస్పీ ఏడీజీపీగా ఉన్న సంజయ్ కుమార్ జైన్ కు ట్రైనింగ్ విభాగం ఏడీజీపీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
