ప్రాణ స్నేహితుడే యముడై వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. నమ్మి పక్కన కూర్చున్న ఫ్రెండే.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన తీరు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. యస్.. మీరు విన్నది ముమ్మాటికి నిజం. తీయటి రసగుల్లా ఇస్తున్నానని నమ్మించి, ఏకంగా ప్రాణాలు తీసే ‘పిగ్-కిల్లర్ బాంబ్’ను చేతిలో పెట్టిన ఈ వికృత ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఆ స్నేహితుడు అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఇంతకు ఆ రోజు రాత్రి ఏం జరిగింది..? వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం.
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా పదరియా ఛాంటా గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేంద్ర బరౌతియా అనే వ్యక్తి ఆ రోజు రాత్రి తన కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రశాంతంగా భోజనం ముగించుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి కాసేపు కాసేపు ముచ్చటించుకుంటూ ఒక చోట కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో రాజేంద్ర స్నేహితుడైన రామభగత్ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత, రామభగత్ తన వెంట తెచ్చిన ఒక వస్తువును రాజేంద్రకు అందించాడు.
రామభగత్ ఇచ్చిన ఆ వస్తువును చూడగానే అచ్చం రసగుల్లా స్వీట్ లాగా కనిపించింది. దాంతో దాన్ని నిజంగానే స్వీట్ అని నమ్మిన రాజేంద్ర బరౌతియా, ఏమాత్రం అనుమానం లేకుండా దాన్ని తీసుకెళ్లి నోట్లో వేసుకుని గట్టిగా కొరికాడు. అయితే అది స్వీట్ కాదు.. అడవి పందులను వేటాడేందుకు ఉపయోగించే ప్రమాదకరమైన ‘పిగ్-కిల్లర్ బాంబ్’. పంటి కింద నలగగానే ఆ బాంబ్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి రాజేంద్ర నోటికి, ముఖానికి తీవ్రమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల కళ్ల ముందే రక్తపు మడుగులో ఆయన కుప్పకూలిపోయాడు.
భారీ పేలుడు శబ్దం వినిపించడం, రాజేంద్ర ఒక్కసారిగా నేలకూలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను హటావుడిగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేంద్ర ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడు రామభగత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
స్నేహితుడే స్వయంగా ఇలా బాంబ్ ఇచ్చి హత్య చేయడం వెనుక అసలు కారణం ఏంటనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? లేక పక్కా పథకం ప్రకారమే రామభగత్ ఈ హత్యకు పాల్పడ్డాడా..? అనే అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రసుగుల్లా ఇచ్చి ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీసిన ఈ దారుణ ఘటనపై ఇంతకు మీరేం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
