హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలోని ధాతు నగర్‌లో జరిగిన ఓ మహిళ హత్య కేసు ఇప్పుడు నగర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పట్టపగలే ఎవరూ గుర్తుపట్టకుండా నిందితుడు హెల్మట్ ధరించి మరీ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటన వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తోంది. మొత్తానికి ఈ కేసును 24 గంటల్లోనే చేదించిన పోలీసులు ఎట్టేకేలకు నిందితుడు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి సంచలన నిజాలు వెల్లడించారు..? నిందితుడు ఆ మహిళను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది.. పోలీసులు చెప్పిన ఆ నిజాలేంటి..?
ఈ దారుణ ఘటన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఉన్న ధాతు నగర్‌లోని శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. ఇదే అపార్ట్‌మెంట్‌లో 34 ఏళ్ల అనిత అనే మహిళ నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న అనితను టార్గెట్ చేస్తూ ఒక అగంతకుడు లోపలికి ప్రవేశించాడు. ఎవరూ తనను గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో ముఖానికి హెల్మెట్ ధరించి వచ్చిన ఆ కిల్లర్, అనితకు ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వకుండా ఆమె నోటికి, చేతులకు గట్టిగా తాళ్లతో కట్టివేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న ఒక ఐరన్ బాక్స్‌ను తీసుకుని, ఆమె తలపై అత్యంత కిరాతకంగా, బలంగా కొట్టడంతో అనిత అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, చేతి గాజులను దోచుకుని అక్కడి నుంచి అత్యంత చాకచక్యంగా పరారయ్యాడు.
ఈ హత్య జరిగిన తర్వాత కాలనీ వాసులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బయటి వ్యక్తులెవరో వచ్చి ఈ పని చేసి ఉంటారని అందరూ భావించారు. కానీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ నిజం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ హత్య చేసింది మరెవరో కాదు.. అనిత నివసిస్తున్న అదే శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ నాలుగో అంతస్తులో ఉండే 41 ఏళ్ల గడ్డ రాజ్ కుమార్. అసలు రాజ్ కుమార్ ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని ఆరా తీస్తే, దీని వెనుక ‘షేర్ మార్కెట్’ వ్యసనం ఉందని తేలింది. అత్యాశకు పోయి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన రాజ్ కుమార్, ఏకంగా రూ.4 కోట్ల వరకు నష్టపోయాడు. దీంతో అప్పుల వాళ్ల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఆ అప్పుల బాధ నుంచి బయటపడటానికి, తన పక్కనే ఉండే అనిత ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసి, పక్కా స్కెచ్ వేసి ఈ మర్డర్‌కు పాల్పడ్డాడు.
హత్య సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, డీసీపీ బి. రాజేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆదిభట్ల ఏసీపీ డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో మీర్‌పేట్ ఎస్‌హెచ్‌ఓ బి. శోభన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మట్టం రాజు, ఇతర పోలీస్ సిబ్బంది అత్యంత వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు హెల్మెట్ పెట్టుకుని రావడం వల్ల సీసీటీవీ ఫుటేజ్‌లో ముఖం కనిపించకపోయినా, పోలీసులు తమకున్న టెక్నికల్ ఎవిడెన్స్ స్థానికంగా సేకరించిన క్లూస్ ఆధారంగా నిందితుడు బయటి వ్యక్తి కాదని, అపార్ట్‌మెంట్‌కు బాగా తెలిసిన వ్యక్తేనని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో అనుమానితులను విచారించగా అసలు నిందితుడు గడ్డ రాజ్ కుమార్ అని తేలింది. ఘటన జరిగిన కేవలం 24 గంటల్లోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
అరెస్ట్ చేసిన నిందితుడు గడ్డ రాజ్ కుమార్ వద్ద నుంచి అనిత ఇంట్లో దోచుకెళ్లిన సుమారు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, నేరం చేసే సమయంలో అతను ధరించిన హెల్మెట్, దుస్తులు, మొబైల్ ఫోన్ అనితను కొట్టడానికి ఉపయోగించిన ఇనుప వస్తువును కూడా కీలక సాక్ష్యాలుగా సీజ్ చేశారు. ఈ వివరాలన్నింటినీ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
