ప్రపంచంలో వింతైన అలవాట్లు, రూపాలతో అందరి దృష్టిని ఆకర్షించే వారు ఎందరో ఉంటారు. సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తారు అమెరికాకు చెందిన 54 ఏళ్ల మాథ్యూ హే. తన అసాధారణమైన గడ్డంతో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సహజ గడ్డం జడ కలిగిన వ్యక్తిగా ఆయన రికార్డు పుటల్లోకి ఎక్కారు. అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన మాథ్యూ హే గడ్డం పొడవు ఏకంగా 5 అడుగుల 3 అంగుళాలు ఉండటం విశేషం.
మాథ్యూ హే ఈ ఘనతతో గత రికార్డును సునాయాసంగా అధిగమించారు. ఇంతకుముందు రుడాల్ఫ్ మార్టినో పేరిట 3 అడుగుల 6 అంగుళాల పొడవుతో ఈ రికార్డు ఉండేది. అయితే, సహజంగా పెరిగిన గడ్డం జడకు, సాధారణ గడ్డానికి మధ్య తేడా ఉందని గిన్నిస్ రికార్డ్స్ స్పష్టం చేసింది. అత్యంత పొడవైన సాధారణ గడ్డం రికార్డు ఇప్పటికీ కెనడాకు చెందిన సర్వాన్ సింగ్ పేరిట ఉంది.మాథ్యూ హే సుమారు 20 ఏళ్లుగా ఈ గడ్డాన్ని పెంచుతున్నారు. మొదట్లో చిన్న గడ్డంతోనే ఉండే ఆయన, ఓసారి కొందరు పిల్లలు తన గడ్డాన్ని జడలా అల్లమని అడగడంతో సరదాగా అంగీకరించారు. ఆ తర్వాత ఆ లుక్ నచ్చడంతో గడ్డం కత్తిరించడం మానేశారు. కాలక్రమేణా అది సహజంగానే ఒకే జడగా మారిపోయింది. ప్రతి ఏటా సుమారు 3 నుంచి 4 అంగుళాల మేర పెరుగుతూ… చివరికి నడుము చుట్టూ బెల్టులా చుట్టుకునే స్థాయికి చేరుకుంది.తాను ఏదో చేసినందుకు ఈ గడ్డం రాలేదని, దాన్ని ఏమీ చేయకుండా వదిలేసినందుకు వచ్చిందంటూ మాథ్యూ చమత్కరించారు. తన గడ్డం మాత్రమే తన గుర్తింపు కాదని ఆయన స్పష్టం చేశారు.
ఈ అరుదైన గడ్డం కారణంగా బయట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, తనకు అంతకుమించి ఎన్నో ఇష్టాలు ఉన్నాయని మాథ్యూ తెలిపారు. ఆయనకు కార్లు, కంప్యూటర్ల పట్ల అమితమైన ఆసక్తి ఉంది. ముఖ్యంగా మజ్దా RX-7 స్పోర్ట్స్ కార్లు, అమిగా కంప్యూటర్లంటే ఆయనకు ఎంతో ఇష్టం. వీటితో పాటు వెయిట్‌లిఫ్టింగ్, వీడియో గేమ్స్ ఆడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం తన హాబీలని ఆయన తెలిపారు. తన స్నేహితులు తన గడ్డం కంటే ఎక్కువగా ఈ హాబీల ద్వారానే తనను గుర్తుపడతారని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ గడ్డాన్ని కత్తిరించే ఆలోచన లేదని మాథ్యూ స్పష్టం చేశారు. దీనికోసం సాధారణ షాంపూ, కండిషనర్ వాడటం తప్ప ప్రత్యేక శ్రద్ధ ఏదీ తీసుకోనని, రోజువారీ పనులకు ఇబ్బంది కలగకుండా దీన్ని మడిచి కట్టుకుంటానని వెల్లడించారు. తన రూపాన్ని చూసి కొందరు విమర్శించినా… ప్రజలు ఒకరినొకరు వారి రూపంతో సంబంధం లేకుండా, అంతర్గత వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించుకోవాలని ఆయన చక్కని సందేశమిచ్చారు.
ఐదు అడుగుల పైగా పొడవుండే గడ్డాన్ని మెయింటైన్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. చాలా మంది ఈ రికార్డు వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందనో లేక ఖరీదైన సెలూన్ ప్రొడక్ట్స్ వాడుతుంటారనో అనుకుంటారు. కానీ మాథ్యూ హే మాత్రం తాను కేవలం సాధారణ షాంపూ, కండిషనర్ మాత్రమే వాడుతానని స్పష్టం చేశారు. అయితే, ఈ గడ్డాన్ని ఆరబెట్టడమే తనకు అత్యంత కష్టమైన పని అని, స్నానం చేసిన ప్రతిసారీ అది పూర్తిగా ఆరడానికి గంటల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా వాహనాలు నడుపుతున్నప్పుడు ఈ గడ్డం జడ కింద పడిపోకుండా, చక్రాలలో లేదా తలుపుల మధ్య ఇరుక్కోకుండా ఆయన ఎంతో అప్రమత్తంగా ఉంటారు. ఇందుకోసం ఆయన గడ్డాన్ని నాలుగైదు సార్లు మడిచి, సురక్షితంగా ఒక క్లిప్ లేదా బెల్టులా నడుముకు కట్టుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పటికీ, కొందరు సోషల్ మీడియా వేదికగా ఆయన రూపాన్ని విమర్శిస్తుంటారు. ఇలాంటి విమర్శలపై మాథ్యూ ఎంతో పరిణతితో స్పందించారు. కేవలం బాహ్య రూపాన్ని చూసి ఒక వ్యక్తిని అంచనా వేయవద్దని, సమాజంలో ప్రతి ఒక్కరి ప్రత్యేకతను గౌరవించే సంస్కృతి పెరగాలని ఆయన పిలుపునిచ్చారు
