ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మారిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది! ఈ మిస్టరీని ఛేదించేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మళ్లీ దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లా టాప్ బాసులు రంగంలోకి దిగడంతో ఈ కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఉమ్మడి కృష్ణా-తూర్పుగోదావరి జిల్లాలను కుదిపేసిన జ్ఞానేశ్వరి కేసును న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు మళ్లీ దృష్టి సారించారు. పాత కోణాలను పక్కనబెట్టి, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ కేసును రీ-ఓపెన్ చేశారు. అప్పట్లో దొరకని ఆధారాల కోసం, సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారం ఆధారంగా దర్యాప్తును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు మరోసారి గ్రౌండ్ లెవెల్ సర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు.
కేసు దర్యాప్తులో వేగం పెంచే ఉద్దేశంతో ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ స్వయంగా రంగంలోకి దిగారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజుతో కలిసి ఆయన నేరుగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏ ప్రాంతం నుంచి జ్ఞానేశ్వరి అదృశ్యమయ్యారు, ఆ సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో అనే కోణంలో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అధికారుల ఈ ఆకస్మిక పర్యటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ తనిఖీల్లో భాగంగా అధికారుల బృందం నేరుగా జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను కలిశారు. ఆనాడు ఏం జరిగింది? ఎవరిపై అనుమానాలు ఉన్నాయి? అనే కోణంలో వారిని అడిగి మరిన్ని కీలక వివరాలను సేకరించారు. తమ బిడ్డ ఆచూకీ కోసం ఏళ్లుగా పోరాడుతున్న తల్లిదండ్రుల ఆవేదనను ఆలకించిన అధికారులు, ఈసారైనా కేసును ఛేదిస్తామనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని దర్యాప్తులో కీలక ఆధారం చేసుకోనున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో మళ్లీ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీకి సంబంధించిన ఏ చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు జోక్యంతో మళ్లీ ఊపందుకున్న ఈ దర్యాప్తులోనైనా నిజాలు బయటపడతాయని, జ్ఞానేశ్వరి ఏమయ్యారనే విషయం తేలుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
