క్రికెట్ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరపడింది. మైదానంలో ‘ధోని.. ధోని..’ అనే అభిమానుల నినాదాల మధ్య, హెలికాప్టర్ షాట్లతో ఉర్రూతలూగించిన మిస్టర్ కూల్.. ఇకపై బ్యాట్ పట్టి బరిలోకి దిగడం లేదు. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌బై చెప్పాశారు. ఐపీఎల్ ధోని రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక సంచలన ప్రకటన చేసింది.ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. 2008లో మొదలైన ధోని ఐపీఎల్ ప్రయాణం ఎలా సాగింది.? ఆటగాడిగా తప్పుకోవడం వెనుక కారణాలేంటి.? ‘తలా’ రికార్డుల ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని, ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికాడు. 45 ఏళ్ల వయసులో, ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మాహీ.. తనకు ఎంతో ఇష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టీమ్ మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తాడు. 2026 సీజన్‌లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ధోని, ఇకపై డగౌట్‌లో ఉండి యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయనున్నాడు. ధోని ఆటగాడిగా తప్పుకోవడంతో సీఎస్కే పర్స్‌లో అదనంగా 4 కోట్ల రూపాయలు అందుబాటులోకి వచ్చాయి.
2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ధోని ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. తన 19 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో ధోని కేవలం రెండు జట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 2008 నుంచి 2015 వరకు వరుసగా ఎనిమిది సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుండి నడిపించాడు. ధోని సారథ్యంలో సీఎస్కే 2010, 2011లలో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.
అయితే, సీఎస్కే ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం విధించిన సమయంలో.. 2016 2017 సీజన్లలో ధోని ‘రైజింగ్ పూణె సూపర్‌జెయింట్’ జట్టు తరపున బరిలోకి దిగాడు. 2016లో పూణె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని, 2017లో కేవలం ఆటగాడిగా కొనసాగి ఆ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనంతో, ధోని మళ్లీ తన సొంత గూటికి చేరుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ ధోని తన మాయాజాలాన్ని కొనసాగించాడు. 2018, 2021, 2023 సీజన్లలో చెన్నై జట్టుకు మరో మూడు ఐపీఎల్ టైటిళ్లను అందించి, ముంబై ఇండియన్స్ సరసన అత్యధికంగా ఐదు ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ధోని నాయకత్వంలో సీఎస్కే ఏకంగా 10 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడటం ఒక అరుదైన రికార్డు. 2024 సీజన్‌కు ముందు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన ధోని, వికెట్ కీపర్‌గా, ఫినిషర్‌గా జట్టుకు అండగా నిలిచాడు.
ఇక ధోని వ్యక్తిగత గణాంకాలను పరిశీలిస్తే.. ఐపీఎల్‌లో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడిన ధోని, 38.30 సగటుతో 5,439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 84 నాటౌట్. 137.45 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన మాహీ, తన కెరీర్‌లో ఏకంగా 264 సిక్సర్లు బాదాడు. వికెట్ల వెనుక మెరుపు వేగంతో స్టంపింగ్‌లు చేస్తూ, క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌లను ఫినిష్ చేసే తీరు ధోనిని కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా మార్చింది.
ధోనిని మెంటార్‌గా నియమిస్తూ సీఎస్కే యజమాని ఎన్. శ్రీనివాసన్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా గెలుపోటముల్లో మేము కలిసి ప్రయాణించామని ఆయన కొనియాడారు. మరోవైపు, సీఎస్కే మేనేజ్‌మెంట్ జట్టులో భారీ మార్పులు చేపట్టింది. సుదీర్ఘకాలం కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. ఇప్పుడు హెడ్ కోచ్ జహీర్ ఖాన్, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనిల వ్యూహాలతో ఐపీఎల్ 2027లో సీఎస్కే సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.
