వరంగల్ జిల్లాలోని రంగసాయిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం తమ ప్రాణాలను తీసుకోవడమే కాకుండా, పెంచుకున్న మూగజీవానికి విషం పెట్టి చంపేశారు. ఇదే ఘటన ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
వరంగల్ నగరంలోని రంగసాయిపేట ఎస్‌బీఐ బ్యాంకు సందులో నల్లపోగుల సంజయ్ కుమార్, శోభ దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మశాలి కులానికి చెందిన సంజయ్ కుమార్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆ కుటుంబం ఇప్పటికే తీవ్ర మానసిక ఆందోళనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారమై, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.
జీవనం గడవడం కోసం సంజయ్ కుమార్ చుట్టుపక్కల వాళ్ల దగ్గర కొంత అప్పు చేశాడు. అయితే, గడువు తీరేసరికి ఆ డబ్బులు చెల్లించలేకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. నలుగురిలో పరువు పోతుందనే ఆవేదన, ఆర్థిక ఇబ్బందుల ఊబి నుంచి బయటపడలేమన్న నిరాశ ఆ దంపతులను మానసికంగా కుంగదీశాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తీవ్ర మనస్థాపానికి గురైన సంజయ్ కుమార్, శోభ దంపతులు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో అత్యంత హృదయవిదారకమైన విషయం ఏమిటంటే… తమ తర్వాత తమ పెంపుడు కుక్క ఒంటరిగా ఇబ్బంది పడుతుందని భావించారో ఏమో గానీ, దానికి కూడా విషమిచ్చి చంపేశారు. తాము ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని స్పష్టంచేస్తూ ఘటనా స్థలంలో ఓ లేఖను రాసిపెట్టారు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్యాభర్తలు ఇలా ప్రాణాలు తీసుకోవడం ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకునేలా చేసింది.
ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో లభించిన నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
