టెక్నాలజీ మంచికైతే వరం.. చెడుకైతే మహా శాపం! ముఖ్యంగా ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్‌ఫేక్‌లు సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని ఎక్కడ ఇరికించేస్తున్నారో అర్థం కాని పరిస్థితి! ఈ టెక్నాలజీ దుర్వినియోగంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే సంచలన లేఖ రాశారు. కళాకారుల హక్కులు, గౌరవాన్ని కాపాడాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డిలను కలవడం సంచలనంగా మారింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల పనిని సులువు చేయడానికి వచ్చింది. కానీ కొందరు కేటుగాళ్లు దీనిని ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఎవరి ముఖాన్ని ఎవరి శరీరానికి తగిలించాలన్నా, ఎవరి గొంతును ఇమిటేట్ చేసి తప్పుడు ప్రచారాలు చేయాలన్నా ఇప్పుడు క్షణాల సమయం చాలు. ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు ఈ డీప్‌ఫేక్ బారినపడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నటీనటుల గ్లామర్, ఇమేజ్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత గౌరవానికి, సృజనాత్మక హక్కులకు ఇది తీవ్ర భంగం కలిగిస్తోంది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరుప్రతిష్టలను చిటికెలో నాశనం చేస్తున్న ఈ టెక్నాలజీ రాక్షస రూపం దాల్చుతున్న తరుణంలో.. దీనిపై ఎవరో ఒకరు గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు!”
ఇదే విషయమై ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా కలిశారు. ఈ భేటీ కేవలం సాధారణ మర్యాదపూర్వకమైనది కాదు.. ఏఐ సృష్టిస్తున్న తీవ్రమైన సమస్యపై జరిగిన చర్చ! ఏఐ ద్వారా ఇష్టానుసారం కంటెంట్ సృష్టించడం వల్ల కళాకారులు, నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను అమిత్ షాకు చిరంజీవి పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై అమిత్ షా కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిశీలిస్తోందని, ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన నిబంధనలు, చట్టాలు తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు, దీనిపై అధికారికంగా ఒక వినతిపత్రం సమర్పించాలని చిరంజీవికి సూచించారు.”
ఇక అమిత్ షా సూచన మేరకు చిరంజీవి వెంటనే స్పందించారు. కేంద్ర హోం మరియు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలను ఉద్దేశించి రాసిన ఒక అధికారిక విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ భేటీ అనంతరం చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తానని కిషన్ రెడ్డి భరోసా ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు. కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులతో పాటు ప్రతి పౌరుడి భద్రతను కాపాడటం మనందరి సమిష్టి బాధ్యత. సాంకేతికత సృజనాత్మకతను పెంచాలి కానీ, గౌరవాన్ని నాశనం చేయకూడదు” అని చిరు రాసుకొచ్చారు. మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఈ సమస్యను నేరుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్ల త్వరలోనే దీనిపై ఒక బలమైన చట్టం వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఏఐ టెక్నాలజీని తప్పుదోవ పట్టించి, తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే వారిపై కఠినమైన శిక్షలు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేలా నిబంధనలు రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
