తమిళనాడులోని మదురై లో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన భారీ దోపిడీ కేసులో ప్రముఖ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మీనాక్షితో పాటు ప్రధాన నిందితుడు నిషాంత్ తండ్రి సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ క్షేత్రంలో గోనె సంచుల్లో పాతిపెట్టిన సుమారు 5 నుంచి 6 కిలోల బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసి చివరికి తప్పించుకోలేకపోయారు. ఒకే ఒక్క చిన్న పొరపాటు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చేతి మణికట్టుపై ఉన్న టాటూనే పట్టించింది.
ఈ ఘటన తమిళనాడులోని మదురై బైపాస్ రోడ్డులో ఉన్న తనిష్క్ జ్యువెలర్స్ షోరూంలో జరిగింది. నిషాంత్ కృష్ణ అనే 25 ఏళ్ల యువకుడు ఈ చోరీకి ప్రధాన సూత్రధారి. షోరూం ప్రారంభించి కేవలం రెండు వారాలే కావడం, భవనం ఇంకా అసంపూర్తిగా ఉండటాన్ని నిషాంత్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. చోరీకి ముందు మూడుసార్లు సాధారణ కస్టమర్లా ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో షోరూంకు వచ్చి పక్కాగా రెక్కీ చేశాడు. నిజానికి ఈనెల 5వ తేదీనే దొంగతనానికి ప్రయత్నించగా, కుక్కలు తరమడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత ఈనెల 11వ తేదీ రాత్రి మళ్లీ రంగంలోకి దిగాడు. ఒంటినిండా నల్లటి దుస్తులు, ముఖానికి ముసుగు, వేలిముద్రలు పడకుండా గ్లౌజులు ధరించి, భవనం వెనక ఉన్న ఇనుప చువ్వల ద్వారా పైకెక్కి మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. కొన్ని సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి, లాకర్ల జోలికి వెళ్లకుండా డిస్ప్లేలో ఉన్న ఆభరణాలను తన డఫ్ బ్యాగులో పట్టినంత నింపుకొన్నాడు. అక్కడ 42 కిలోలకు పైగా బంగారం ఉన్నా, బ్యాగు నిండిపోవడంతో మిగిలినవి వదిలేసి, నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ తాడు సాయంతో కిందికి దిగి సులువుగా పరారయ్యాడు.
మరుసటి రోజు ఉదయం షోరూం తెరిచిన నిర్వాహకులు, డిస్ప్లేలో ఉన్న సుమారు 15 కిలోల బంగారం, వజ్రాభరణాలు మాయమవ్వడం చూసి షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, షోరూం ప్రారంభమైన రోజు నుంచి ఉన్న సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. దొంగ ఒళ్లంతా కప్పుకున్నా, తన చేతి మణికట్టుపై ఉన్న పచ్చబొట్టును మాత్రం కప్పడం మర్చిపోయాడు. చోరీ జరిగిన రోజు సీసీ కెమెరాల్లో కనిపించిన టాటూ, అంతకుముందు రెక్కీకి వచ్చిన ఒక అనుమానాస్పద యువకుడి చేతిపై ఉన్న టాటూ ఒక్కటే అని పోలీసులు గుర్తించారు. మరోవైపు దొంగ పారిపోయిన బైక్ ఆధారంగా ఆరా తీయగా, అది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన మీనాక్షి నాచ్చియార్దని తేలింది. ఆమె కాల్ డేటాను ట్రాక్ చేయగా, తిరుప్పూర్ నుంచి వేరే వ్యక్తి ఫోన్ ద్వారా నిషాంత్ ఆమెకు కాల్ చేసి దోచుకున్న నగల వివరాలు చెప్పినట్లు బయటపడింది. తన ప్రియురాలు మీనాక్షి కట్టుకుంటున్న ఇంటి కోసం డబ్బులు సమకూర్చడానికే నిషాంత్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
మీనాక్షిని అదుపులోకి తీసుకుని విచారించడంతో దోచుకున్న బంగారాన్ని ఎక్కడ దాచారో బయటపడింది. మదురై మాడకుళంలోని ఇంట్లో, సమీపంలోని కొండ ప్రాంతంలో దాచిన సుమారు 6 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి సహకరించిన నిషాంత్ ప్రియురాలు మీనాక్షితో పాటు, ఆటో డ్రైవర్ అయిన నిషాంత్ తండ్రి సురేష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో ఈనెల 29 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇక ఈ ఘటనలో షోరూం యాజమాన్యం నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పండుగ సీజన్ వ్యాపారం కోసం లాకర్ గది సిద్ధం కాకముందే షోరూం తెరవడం, రాత్రిపూట విలువైన నగలను డిస్‌ప్లేలోనే వదిలేయడం, పైగా చోరీ జరిగిన సమయంలో అలారం ఆఫ్ చేసి ఉండటంతో ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ తర్వాత తాను వేసుకున్న బట్టలను పొలాల్లో తగులబెట్టి, పోలీసులకు చిక్కకుండా రూట్లు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు నిషాంత్ కృష్ణ కోసం ఇప్పుడు 9 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. మిగిలిన 9 కిలోల బంగారంతో పరారీలో ఉన్న అతని ఫోన్ సిగ్నల్స్ చివరిసారిగా తిరుప్పాలై, తిరుప్పూర్ ప్రాంతాల్లో ట్రేస్ అయ్యాయి. నిందితుడు హైదరాబాద్, పొళ్లాచ్చి వైపు కూడా వెళ్లే అవకాశం ఉండటంతో అక్కడికి కూడా ప్రత్యేక బృందాలను పంపించారు. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా, చేసిన నేరం ఎప్పటికైనా బయటపడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
