ఏపీ మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న తీర ప్రాంత ప్రజలు రైతులకు.. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు మరింత కలవరం రేపుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఈ అల్పపీడనం .
బంగాళాఖాతంలో మరో పెను తుపాను రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ, ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఈ వాయుగుండం అక్కడితో ఆగకుండా, మరింత వేగంగా ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించనుంది. దీని ఫలితంగా సోమవారం ఉదయానికి ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత సోమవారం సాయంత్రానికి దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పూర్తిస్థాయి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రంలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ తుపాను మరింత శక్తివంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
సోమవారం సాయంత్రానికి తుపానుగా మారిన తర్వాత, ఇది మరింత బలపడి బుధవారానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ తుపాను కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత వాతావరణ నమూనాల ప్రకారం, బుధవారం తర్వాత ఇది ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను గమనంలో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటాయా లేదా అనే దానిపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఈ తీవ్ర తుపాను ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తుపాను తీరానికి సమీపించే క్రమంలో వచ్చే గురువారం , శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలతో పాటు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కోత దశలో ఉన్న వరి మరియు ఇతర పంటలపై ఈ తుపాను ప్రభావం పడుతుందేమోనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కోసిన పంట కళ్లాల్లో ఉండటం, మరికొన్ని చోట్ల పంట కోతకు సిద్ధంగా ఉండటంతో అకాల వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఇక సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి తిరిగి రావాలని హెచ్చరికలు పంపారు. పోర్టులలో ప్రమాద హెచ్చరికలను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం బుధవారానికి తీవ్ర తుపానుగా మారి ఉత్తర కోస్తాంధ్ర వైపు దూసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు, రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
