తల్లి ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన పసిపాప.. అమ్మ చేతి గోరుముద్దలు తినాల్సిన చిన్నారి.. ఇంకా లోకాన్ని పూర్తిగా చూడనే లేని ఎనిమిది నెలల పసికందు చివరికి విగతజీవిగా మారింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కాలయమురాలై, ఆ చిన్నారి గొంతు నులిమి ప్రాణాలు తీసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హృదయాలను కలచివేసే ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ మండలం ధామ్య తండా శివారులోని జేత్యా తండాకు చెందిన బన్సీలాల్, సుప్రజ దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల కుమార్తె త్రిష ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అభం శుభం తెలియని చిన్నారి త్రిషను తల్లి సుప్రజ గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఉరి వేసుకోవడం విఫలం కావడంతో ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి బలవన్మరణానికి యత్నించింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే ఇంటిలోకి వెళ్లి చూడగా చిన్నారి త్రిష అప్పటికే మృతి చెంది ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న సుప్రజను స్థానికులు హుటాహుటిన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, బాలల సంరక్షణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అసలు ఆ తల్లి మనసులో ఏం జరిగింది? కన్నబిడ్డ ప్రాణాలు తీసేంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? కుటుంబంలో ఏవైనా కలహాలు ఉన్నాయా? లేక ఈ దారుణం వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి అంటే బిడ్డకు తొలి ప్రపంచం. బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోయేది తల్లే. అలాంటి మాతృత్వానికే మచ్చ తెచ్చేలా త్రిష విషయంలో ఈ ఘోరం ఎందుకు జరిగింది? ఆ తల్లి మానసిక పరిస్థితి, కుటుంబ నేపథ్యంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉంది. ఒకవైపు అభం శుభం తెలియని పసిప్రాణం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోగా, మరోవైపు ఆ తల్లి ఆసుపత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీరని శోకసంద్రంలో ముంచెత్తింది.
