ఇండస్ట్రీలో వేధింపులు ఎప్పుడూ ఉంటాయన్న నటి
అన్ని రంగాల్లోనూ ఈ దోపిడీ ఉందని స్పష్టీకరణ
గ్లామర్ ఫీల్డ్ వల్లే ఎక్కువ చర్చ జరుగుతోందని వ్యాఖ్య
పాత రోజుల్లో సెట్లలో వాష్‌రూమ్‌లు లేవని ఆవేదన.
కారులోనే బాటిళ్లలో మూత్ర విసర్జన చేశామన్న రమ్యకృష్ణ
నేటి తరం నటులు అదృష్టవంతులని ప్రశంస
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే అంశం ‘కాస్టింగ్ కౌచ్’. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో జరిగే వేధింపులపై ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా సీనియర్ స్టార్ హీరోయిన్, మన శివగామి రమ్యకృష్ణ ఈ విషయంపై చాలా బోల్డ్‌గా, ఓపెన్‌గా మాట్లాడారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రమ్యకృష్ణ ఏమన్నారు? ఆనాటి షూటింగ్ కష్టాల గురించి ఆమె చెప్పిన షాకింగ్ విషయాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం!”
సినిమా ఇండస్ట్రీ అంటే బయటి నుంచి చూసేవాళ్లకు అంతా రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ ఆ వెలుగుల వెనుక ఉండే చీకటి కోణాల గురించి సీనియర్ నటి రమ్యకృష్ణ తాజాగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న ‘కాస్టింగ్ కౌచ్’ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులు కేవలం నిన్నో మొన్నో మొదలైనవి కావని, అప్పుడూ ఉన్నాయని, ఇప్పుడూ ఉన్నాయని, భవిష్యత్తులో కూడా ఉంటాయని రమ్యకృష్ణ చాలా స్పష్టంగా చెప్పేశారు. అయితే ఇది కేవలం సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ఈ తరహా దోపిడీ జరుగుతుందని ఆమె అన్నారు.
ఇష్టంతోనో, బలవంతంగానో, లేదా మామూలుగానో.. ఇది జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. మనది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి దీని గురించి మీడియాలో, బయట ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ బయట సాధారణ జీవితాల్లో కూడా ఎంతోమంది మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు” అంటూ రమ్యకృష్ణ చాలా ప్రాక్టికల్‌గా సమాధానం ఇచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన రమ్యకృష్ణ, ఇండస్ట్రీ వాస్తవాలను ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ తాము కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో పడిన కష్టాలను కూడా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడున్న హీరోయిన్లకు షూటింగ్ సెట్లలో లగ్జరీ క్యారవాన్‌లు, అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. కానీ 80లు, 90లలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేదట. ఆ రోజుల్లో ఫిల్మ్ సెట్లలో కనీసం వాష్‌రూమ్‌లు కూడా ఉండేవి కావని రమ్యకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో బట్టలు మార్చుకోవడానికి కూడా సరైన ప్రైవసీ ఉండేది కాదట. అవుట్‌డోర్ షూటింగ్స్‌కు వెళ్ళినప్పుడు అంబాసిడర్ కార్లలో కూర్చుని, బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పిన మాటలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఎండనక, వాననక చెట్ల కింద, చీరలు అడ్డుపెట్టుకుని మేకప్ వేసుకునే రోజుల నుంచి నేటి స్థాయికి వచ్చామని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆనాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి తరం నటీనటులు చాలా అదృష్టవంతులని రమ్యకృష్ణ అన్నారు. తాము పడిన కష్టాల్లో కనీసం పావు వంతు కూడా ఇప్పటి వాళ్లు అనుభవించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, ఒక సీనియర్ నటిగా రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకవైపు ఇండస్ట్రీలోని చేదు నిజాలను బయటపెట్టడమే కాకుండా, మరోవైపు అప్పటి తరం నటీనటుల డెడికేషన్ ఏంటో నేటి తరానికి తెలియజేశాయి.
