రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు, వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ జంతువుల పట్ల తనకున్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నారు. మృత్యువుతో పోరాడుతున్న ‘రాజా’ అనే బుల్లి ఏనుగును రక్షించేందుకు ఆయన తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకుంటోంది. అసలు ఆ గున్న ఏనుగుకు ఏమైంది? అస్సాం నుంచి గుజరాత్ వరకు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ కథ అక్టోబర్ 2వ తేదీన అస్సాంలోని గోగాముఖ్ ప్రాంతంలో మొదలైంది. అక్కడ 11 ఏళ్ల ఒక ఆడ ఏనుగు 7 వారాల కిందట అందమైన మగ గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. అందరూ ఎంతో సంతోషంతో ఆ ఏనుగు పిల్లకు ‘రాజా’ అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రసవం జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలియదు కానీ, తల్లి ఏనుగు తన కాలితో ఆ ఏనుగును బలంగా తన్నింది. ఆ దెబ్బకు రాజా వెనుక వైపు కుడి కాలులోని తొడ ఎముక, అంటే వైద్య పరిభాషలో ‘ఫీమర్’ అని పిలిచే ప్రధాన ఎముక పూర్తిగా విరిగిపోయింది. పుట్టిన క్షణం నుంచే ఆ ఏనుగు పిల్ల క్షణం నుంచి నరకయాతన అనుభవించడం మొదలుపెట్టింది. కనీసం తన కాళ్లపై తాను నిలబడలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది.
రాజా దయనీయ స్థితి గురించి సంరక్షకుల ద్వారా సమాచారం అందుకున్న వంతారా బృందం అక్టోబర్ 8న తక్షణమే రంగంలోకి దిగింది. విరిగిన ఎముక అతుక్కోవడానికి ప్రాథమికంగా ప్లాస్టర్ కాస్ట్ వేసి, అక్టోబర్ 10న యజమాని నివాసానికి తరలించారు. అక్కడ కండరాలకు బలం చేకూరడానికి ‘హైడ్రోథెరపీ’ వంటి ప్రత్యేక చికిత్సలను కూడా అందించారు. అయినప్పటికీ, పసి వయసు కావడం వల్ల రాజా శరీరం ఆ బాధను తట్టుకోలేకపోయింది. రోజురోజుకూ ఆరోగ్యం మరింత క్షీణించడం మొదలైంది. ఒకవైపు తీవ్రమైన డయేరియా, మరోవైపు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆ చిన్నారిని చుట్టుముట్టాయి. దీనికి తోడు రక్తంలో చక్కెర స్థాయులు తరచూ పడిపోవడం, కదలలేక ఎక్కువసేపు ఒకే వైపు పడుకోవడం వల్ల తల భాగంలో బెడ్ సోర్స్ లాంటి గాయాలు ఏర్పడటంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
స్థానికంగా అందిస్తున్న వైద్యం సరిపోదని గ్రహించిన వైద్య బృందం, రాజాను వెంటనే గుజరాత్‌లోని జామ్‌నగర్ వంతారా కేంద్రానికి తరలించాలని నిర్ణయించింది. అయితే అస్సాంలోని గువాహటి నుంచి జామ్‌నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 2,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి. అంత దూరం రోడ్డుపై ప్రయాణిస్తే ఆ గున్న ఏనుగు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే అనంత్ అంబానీ ప్రత్యేక చొరవ తీసుకుని, కేవలం నాలుగు గంటల్లో గమ్యస్థానానికి చేర్చేలా ఒక ప్రత్యేక ఫ్లైట్ ను సిద్ధం చేశారు. ప్రయాణ సమయంలో రాజా విరిగిన కాలిపై ఏమాత్రం ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఇంజనీర్లు, వైద్యులు కలిసి ప్రత్యేక రవాణా పెట్టెను, దానిలో అత్యంత మెత్తటి పరుపులను అమర్చారు. అనంత్ అంబానీ ఆధ్వర్యంలో ఇలా ఏనుగుల కోసం ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టడం ఇది మూడోసారి కావడం విశేషం.
ప్రస్తుతం సురక్షితంగా జామ్‌నగర్ చేరుకున్న రాజాకు వంతారాలోని ప్రపంచ స్థాయి ప్రత్యేక ఏనుగుల ఆసుపత్రిలో చికిత్స ప్రారంభమైంది. అక్కడి నిపుణులైన వెటర్నరీ డాక్టర్ల బృందం రాజాకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో పాటు, విరిగిన తొడ ఎముకను తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి అత్యాధునిక వైద్యాన్ని అందించనున్నారు. మూగజీవాల పట్ల అనంత్ అంబానీ చూపిస్తున్న ఈ నిబద్ధత, వంతారా బృందం చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. మృత్యువు అంచుల వరకు వెళ్లిన మన బుల్లి రాజా త్వరలోనే పూర్తిగా కోలుకుని, మళ్లీ తన కాళ్లపై తాను ఉత్సాహంగా నడవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.
