రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భయానక వాతావరణం నెలకొంది. మూడు రోజుల క్రితం మనిషి కాలు పడగా.. తాజాగా అదే ప్రాంతంలో ఏకంగా మనిషి తల లభ్యం కావడంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. అసలు ఇబ్రహీంపట్నం గాంధీనగర్ కాలనీలో ఏం జరుగుతోంది? ఆ శరీర భాగాలు ఎవరివి? ఈ దారుణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో చోటుచేసుకుంటున్న ఈ వరుస పరిణామాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. సరిగ్గా మూడు రోజుల క్రితం, గాంధీనగర్ కాలనీ పరిసరాల్లో మనిషికి చెందిన కాలు లభ్యమయ్యాయి. అప్పుడే స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా శరీర భాగాలను ఇలా పడేశారా అన్న చర్చ మొదలైంది. ఆ ఘటన తాలూకు భయం ఇంకా మనసుల నుంచి చెరిగిపోకముందే, తాజాగా అదే కాలనీలో మనిషి తల కూడా లభ్యం కావడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఒకే ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో ఇలా మనిషి శరీర భాగాలు విడివిడిగా బయటపడుతుండటంతో గాంధీనగర్ కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అసలు తమ కాలనీలో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పిల్లలను బయటకు పంపాలన్నా, ఒంటరిగా నడవాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడో హత్య చేసి ఇక్కడ తీసుకువచ్చి పడేస్తున్నారా, లేక తమ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఏదైనా ఘోరం జరిగిందా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నాయి.
ఇప్పుడు ఇబ్రహీంపట్నం అంతటా ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. మూడు రోజుల క్రితం దొరికిన కాళ్లు, తాజాగా బయటపడిన తల ఒకే వ్యక్తికి చెందినవా అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక పోలీసులు స్పాట్ చేరుకుని పుర్రెను స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అవి ఒకే వ్యక్తికి చెందినవైతే, మిగిలిన శరీర భాగాలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఆ మరణించిన వ్యక్తి ఎవరు? స్థానికుడా లేక బయటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తా? ఒకవేళ హత్య చేసి ఉంటే కారణం ఏమిటి? పాత కక్షలా, వివాహేతర సంబంధాలా లేక మరేదైనా కారణమా అనే ప్రశ్నలు స్థానికంగా మిస్టరీగా మారాయి. నిందితులు ఎంతో పక్కాగా ప్లాన్ చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు రోజుల్లో ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
ఒకే కాలనీలో వరుసగా మనిషి శరీర భాగాలు లభ్యమవుతున్న నేపథ్యంలో, అసలు నిజాన్ని బయటకు తీయడం ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం ద్వారా, అలాగే ఇటీవల మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అన్న కోణంలో ఆరా తీస్తే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, దోషులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
