హైదరాబాద్ సమీపంలో ఉన్న ఆదిభట్లలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గృహప్రవేశం కొరకు సెలవు కొరడంతో కాలేజీ యాజమాన్యం నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్థానికి గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు, మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
మృతి చెందిన విద్యార్థి పేరు కార్తీక్, వయసు కేవలం 16 సంవత్సరాలు. అతను రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొంగులూరులో ఉన్న ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కార్తీక్ కుటుంబ సభ్యులు కొత్త ఇల్లు కట్టుకుని, గృహప్రవేశం వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబమంతా ఒకచోట చేరే ఆ శుభకార్యానికి హాజరవ్వాలని కార్తీక్ ఎంతో ఆశపడ్డాడు. కొత్త ఇంట్లో అడుగుపెట్టే ఆ మధుర క్షణాల్లో తానూ పాలుపంచుకోవాలని ఎన్నో కలలు కన్నాడు.
గృహప్రవేశం వేడుకకు వెళ్లేందుకు కార్తీక్ కళాశాల యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్‌ను సెలవు కోరాడు. ఇంట్లో అత్యవసరమైన శుభకార్యం ఉందని, తనను ఇంటికి పంపించాలని విజ్ఞప్తి చేశాడు. కానీ, కార్తీక్ ఆశలపై కాలేజీ యాజమాన్యం నీళ్లు చల్లింది. ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడానికి కఠినంగా నిరాకరించినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంట్లో పండుగ వాతావరణం, మరోవైపు కనీసం ఒక రోజు కూడా ఇంటికి వెళ్లనివ్వని కాలేజీ నిబంధనలు ఆ పదహారేళ్ల కుర్రాడిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, తీవ్ర మానసిక వేదనతో కుంగిపోయిన కార్తీక్, కళాశాలలోనే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు.
కార్తీక్ మృతితో బొంగులూరు కళాశాల ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న తోటి విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. గృహప్రవేశం లాంటి ముఖ్యమైన వేడుకకు వెళ్తానని అడిగినా ప్రిన్సిపాల్ ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించారని, అనుమతి నిరాకరించడం వల్లే కార్తీక్ ఇంతటి దారుణ నిర్ణయం తీసుకున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని, సెలవుల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రాణనష్టాలు జరుగుతున్నాయని స్థానికులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు వెంటనే బొంగులూరులో ఉన్న కాలేజీకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్ పాత్రపై, అలాగే తోటి విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సంతోషంగా గృహప్రవేశం జరుపుకోవాల్సిన ఇంట్లో, ఇప్పుడు కొడుకు మరణవార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల కఠిన నిబంధనల వల్ల ఇలాంటి పసిప్రాణాలు బలికావడం అత్యంత బాధాకరం.
