ఒక చిన్న మాట, ఒక క్షణిక ఆవేశం.. ఓ కుటుంబాన్ని కోలుకోలేని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఏడేళ్ల కుమార్తె, మూడేళ్ల కొడుకు.. ఆ పసిమనసులకు రేపు ఏం జరగబోతుందో కూడా తెలియని వయసు. అలాంటి చిన్నారులను ఒంటరిగా వదిలేసి, ఓ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఫోన్ ఎక్కువగా చూస్తోందని తల్లి చేసిన సాధారణ మందలింపునే ఆ యువతి అంత తీవ్రంగా తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. చిన్నపాటి మనస్తాపమే ప్రాణాలు తీసేంత పెద్ద విషాదంగా ఎందుకు మారింది? హయత్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఏంటి..?
లక్ష్మీదేవి వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆమె స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎల్లమ్మ రంగాపురం గ్రామం. ఏడేళ్ల క్రితం ఆమెకు నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని టీపీగౌరారం గ్రామానికి చెందిన పగిళ్ల లక్ష్మణ్ తో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి ఆమె హయత్‌నగర్ పరిధిలో నివాసం ఉంటోంది. కష్టసుఖాలను పంచుకుంటూ, పిల్లల ఎదుగుదలను చూస్తూ సాగుతున్న ఆ కుటుంబంలో అంతా సాధారణంగానే కనిపించింది. చిన్న చిన్న అవసరాలతో, కుటుంబ బాధ్యతలతో గడుస్తున్న ఆ ఇంట ఇంతటి పెను విషాదం పొంచి ఉందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు.
ఇటీవల లక్ష్మీదేవి భర్త తన శక్తి మేరకు ఈఎంఐలో ఆమెకు ఒక కొత్త ఫోన్ కొనిచ్చారు. కొత్త ఫోన్ రావడంతో ఆమె దానిపై ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. గురువారం రోజున లక్ష్మీదేవి ఎక్కువగా ఫోన్ చూస్తుండటాన్ని గమనించిన తల్లి అలివేలు, ఒక తల్లిగా తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ ఆమెను మందలించారు. ఆ సమయంలో అలివేలు మాటల్లో ఏదో సాధారణ హితవు మాత్రమే ఉండి ఉంటుంది. కానీ, లక్ష్మీదేవి మనసులో ఏం జరిగిందో, ఏ ఆలోచనలు ఆమెను కుంగదీశాయో తెలియదు కానీ, ఆ మాటలతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. చిన్న విషయానికే తన మనసు అంతగా నొచ్చుకుందని ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే మదనపడిపోయింది.
గురువారం జరిగిన ఆ ఘటన తర్వాత రాత్రి గడిచి, శుక్రవారం ఉదయం తెల్లారింది. ఎప్పటిలాగే భర్త తన పనికి వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మనసులో మాత్రం ఏదో తెలియని భారంగా, అశాంతిగా ఉంది. ఆ రోజు ఏడేళ్ల కుమార్తెను పాఠశాలకు కూడా పంపలేదు. మూడేళ్ల చిన్న కొడుకును టీవీ చూసేందుకు అక్కతో పాటు ఉంచి, తాను ఒక్కతే గదిలోకి వెళ్లింది. ఆ పసిపిల్లలు బయట ఆడుకుంటూ, టీవీ చూస్తూ సంతోషంగా ఉన్న సమయంలోనే, లోపల తల్లి మాత్రం తన జీవితాన్ని ముగించాలనే ఘోరమైన నిర్ణయం తీసుకుంది. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త గుండెలు పగులేలా ఏడ్చాడు. ఆమె తల్లి కూడా ఎందుకు తల్లి ఇంత పని చేశావు అంటూ కన్నీరు మున్నీరైంది.
ఇక తల్లి కోసం ఎదురుచూసే ఆ ఇద్దరు పసిపిల్లలకు ఇక అమ్మ లేదనే చేదు నిజం ఎలా అర్థమవుతుంది? కన్నబిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం నిజంగా అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యుల రోదనలు, ఆ చిన్నారుల దీనస్థితి చూసిన వారందరి కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయి. ఏ కష్టం వచ్చినా, ఏ మాట మనసును నొప్పించినా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ, ఇలా ప్రాణాలు తీసుకునేంత తీవ్ర నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
