సిద్దిపేట జిల్లా చేర్యాలలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న అతడిని అటుగా వెళ్తున్న మహిళా ఎస్సీ క్షణాల్లో అలర్ట్ అయ్యారు. ప్రాణాలకు తెగించి పక్కనే ఉన్న గొనె సెంచులతో మంటలను అదుపు చేసి అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ షాకింగ్ ఘటన శుక్రవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న కేపిఆర్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. బాధితుడిని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడిగా గుర్తించారు. గత కొంతకాలంగా రమేష్ కుటుంబంలో కలహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మానసిక ఒత్తిడి, ఆవేదనను తట్టుకోలేక రమేష్ జీవితంపై విరక్తి చెందాడు. శుక్రవారం చేర్యాలలోని కేపిఆర్ కాలనీ సమీపానికి చేరుకున్న అతను, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లోనే మంటలు అతని శరీరమంతా వ్యాపించడంతో, రమేష్ గట్టిగా కేకలు వేస్తూ అక్కడే విలవిల్లాడిపోయాడు.
రమేష్ ఒంటిపై మంటలతో ఆర్తనాదాలు చేస్తున్న సరిగ్గా అదే సమయంలో, చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి అటువైపుగా వెళ్తున్నారు. రహదారి పక్కన మంటల్లో కాలిపోతూ కేకలు వేస్తున్న యువకుడిని ఎస్సై వెంటనే గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన ప్రాణాలకు సైతం ప్రమాదం వాటిల్లుతుందనే భయం లేకుండా ఎస్సై తక్షణమే రంగంలోకి దిగారు. మంటలను లెక్కచేయకుండా, పరిసరాల్లో కనిపించిన గోనె సంచులను తీసుకుని రమేష్ ఒంటిపై ఉన్న మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆమె చూపిన చాకచక్యం, వేగవంతమైన స్పందన వల్ల కొద్దిసేపటికే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎస్సై అపూర్వ రెడ్డి గనుక ఆ సమయంలో అటువైపు రాకపోయి ఉంటే, రమేష్ ప్రాణాలు దక్కేవి కావని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మంటలను అదుపు చేసిన వెంటనే ఎస్సై అపూర్వ రెడ్డి మానవత్వంతో రమేష్‌ను హుటాహుటిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, గాయాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం రమేష్ సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రమేష్ ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే ప్రధాన కారణమా, లేక దీని వెనుక ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
పోలీసులంటే కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షించే వారు మాత్రమే కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులు అని ఎస్సై గూడ అపూర్వ రెడ్డి మరోసారి నిరూపించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక యువకుడిని చావు నుంచి కాపాడిన ఎస్సై సాహసాన్ని స్థానికులు, ఉన్నతాధికారులు, నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కుటుంబ సమస్యలు ఎదురైనా ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
