టాలీవుడ్‌లోకి మరో సరికొత్త రొమాంటిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ రాబోతోంది. అదే.. ‘ఇట్లు అర్జున’. యంగ్ హీరో అనీష్, అందాల భామ అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు!
ట్రైలర్ రిలీజ్ చేయడమే కాదు.. ఎన్టీఆర్ ఈ సినిమా టీమ్‌ని, ముఖ్యంగా హీరో అనీష్‌ని తెగ మెచ్చుకున్నారు. సాధారణంగా ఫస్ట్ సినిమా
అనగానే హీరోలు మాస్ డైలాగులు, ఫైట్లు ఉండాలనుకుంటారు. కానీ ఈ సినిమాలో అనీష్ పాత్రకు అస్సలు మాటలు ఉండవు! దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. “అనీష్, నీ తొలి సినిమాలోనే ఒక్క మాట కూడా లేకుండా నటించడం నిజంగా పెద్ద సాహసం. కథను నమ్మి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ఎంచుకున్నందుకు చాలా హ్యాపీ. నీకు మంచి సక్సెస్ రావాలి సోదరా” అంటూ ట్వీట్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ అనశ్వర, డైరెక్టర్ మహేశ్ ఉప్పాల, రాజా మహాదేవన్, వెంకీ కుడుములతో పాటు టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. మన హీరో అర్జున్‌కు మాటలు రావు. కానీ, అతను మామూలోడు కాదు.. సిటీలోనే చేయితిరిగిన దొంగ! నగరంలో జరిగిన ఒక పెద్ద దొంగతనం కేసులో పోలీసులు అతడినే మెయిన్ విలన్‌గా అనుమానించి వేట మొదలుపెడతారు. ఇంకోవైపు.. చదువంటే ప్రాణమిచ్చే ఒక సిన్సియర్ స్టూడెంట్ కీర్తిని (అనశ్వర రాజన్) అర్జున్ ప్రేమిస్తాడు. అర్జున్ చాలా మంచివాడని కీర్తి నమ్ముతుంది.
అయితే అసలు ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే.. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ఒక పెన్‌డ్రైవ్ కోసం సిటీలో ఒక భయంకరమైన గ్యాంగ్ వెతుకులాట మొదలుపెడుతుంది. ఆ డబ్బు కోసం వాళ్ళు ఎంతటి దారుణానికైనా తెగిస్తారు. కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల ఆ గ్యాంగ్, అటు పోలీసులు.. అందరూ కలిసి హీరో అర్జున్, హీరోయిన్ కీర్తి వెంట పడతారు. ఈ హై-వోల్టేజ్ చేజింగ్‌లో మూగవాడైన ఒక దొంగ.. అంత పెద్ద గ్యాంగ్‌ని, పోలీసులను ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమని ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది.
ఈ సినిమా వెనుక టాలీవుడ్ పెద్ద హస్తాలు కూడా ఉన్నాయి. మన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుంటే.. కింగ్ అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాతో మహేశ్ ఉప్పాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ ఈ ట్రైలర్‌లో నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.
యాక్చువల్‌గా ఈ సినిమా అక్టోబర్ 30నే రిలీజ్ కావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి.. ఫైనల్‌గా నవంబర్ 13న థియేటర్లలోకి వస్తోంది. మరి సరికొత్త కథతో వస్తున్న ఈ మూగ దొంగ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
